కూరగాయల ధరలు (కిలోలల్లో)
కూరగాయ వారం ప్రస్తుతం
క్రితం
టమాట 20 40
ఆలుగడ్డ 30 50
దోసకాయ 40 60
పచ్చిమిర్చి 50 80
సోరకాయ 40 80
కాకరకాయ 50 80
క్యారెట్ 40 80
బెండకాయ 50 80
వంకాయ 50 80
దొండకాయ 40 100
బీరకాయలు 50 100
చిక్కుడుకాయ 80 120
మునగకాయ 70 150
బీన్స్ 80 160
వెజిటేబుల్.. రేటు డబుల్
ఫ బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
ఫ మోంథా తుపాను ప్రభావంతో
ధరలు పెరిగాయంటున్న వ్యాపారులు
ఫ పేద, మధ్య తరగతి వారిపై
అదనపు భారం
సూర్యాపేట : మన పెరట్లో పెరిగిన దొండ కాయలను ఇరుగు పొరుగు వారికి ఉత్తిగనే ఇచ్చే వారు. మన డాబాపై కాసే సోర కాయలు బంధువులందరికీ పంచే వారు. బజారులో అయితే ఏ కాయ తీసుకున్నా రూ.10కి ఇచ్చే వారు. అలాంటి దొండ నేడు కిలో రూ.100 పలుకుతోంది. సోరకాయ కూడా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక మిగతా కూరగాయలు కూడా కిలో రూ.100కు చేరువలోనే ఉన్నాయి. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లోనే వాటి రేట్లు రెట్టింపు కావడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల రేట్లు రెట్టింపయ్యాయి. ఏ కూరగాయ కొన్నా కిలో రూ.100కు చేరువలోనే ఉంది. దాంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ తారుమారవుతోంది. నిన్నటి వరకు రూ.20కే కిలో అమ్మిన టమాట, ఆలుగడ్డలు నేడు రూ. 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, సోరకాయ, వంకాయ, బీర వంటివి కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇక బీన్స్, చిక్కుడు, మునగ వంటివి కిలో వంద దాటి పోయాయి. దాంతో పేదలు కూరగాయలు కొనుగోలు తగ్గించేశారు. రోజుకు రెండు కూరలు వండే వారు ఒక దానితోనే సరిపెట్టుకుంటున్నారు. మిగతా పూటలు పచ్చడి, పప్పుచారుతో లాగించేస్తున్నారు.
భారీ వర్షాలతోనే..
జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు లేదు. దాంతో నిత్యం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటుంటారు. అయితే మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, విజయవాడతో పాటు హైదరాబాద్ నుంచి కూర గాయలు దిగుమతి అవుతుంటాయి. అయితే వర్షాల తరువాత అక్కడి వ్యాపారులే కూరగాయల రేట్లు పెంచి సరఫరా చేస్తున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు కూరగాయలు తక్కువగా రావడం, స్థానికంగా డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కూరగాయల రేట్లను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యస్తం చేస్తున్నారు. కొన్ని కూరగాయల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నారని కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు.
గత నెల 22 నుంచి ఈ నెల 19వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో ప్రతి ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. అయ్యప్ప, భవాని, ఆంజనేయస్వామి ఇలా వివిధ మాలలు ధరిస్తారు. స్వాములకు అన్నదానాలు నిత్యం కొనసాగుతాయి. ఎక్కువ మంది మాంసాహారం మానేసి శాకాహారం మాత్రమే తింటారు. దాంతో కూరగాయలకు డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. ఏది కొనాలన్నా కిలో 100కు చేరువలో ఉన్నాయని, మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల ధరలు (కిలోలల్లో)
కూరగాయల ధరలు (కిలోలల్లో)


