వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
సూర్యాపేటటౌన్ : మహిళలు, యువతులు తమపై జరుగుతున్న వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో షీ టీం ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో వంటి వాటిపై అవగాహన కల్పిస్తునట్లు పేర్కొన్నారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. గత నెలలో షీటీమ్స్‌కు 21 ఫిర్యాదులు అందాయని, 31 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, రెండు కేసులతో పాటు 5పెట్టీ కేసులు నమోదు చేశారని తెలిపారు. 44 కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చారని, 6 కేసులను పోలీస్ స్టేషన్లకు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు షీ టీం నబర్ 8712686056కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారానైనా, డయల్ 100కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శనివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
సూర్యాపేట అర్బన్ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ కాంటాలు వేయక పోవడంతో వర్షాలకు ధాన్యం తడుస్తున్నదని చెప్పారు. మోంథా తుపాన్ వల్ల వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు, కూరగాయల తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయాయరన్నారు. ప్రభుత్వం పంటనష్టపోయిన రైతుకు వరికి ఎకరాకు రూ.30వేలు, పత్తికి రూ.50 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.70 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.
అమరుల ఆశయసాధనకు కృషి చేయాలి
తిరుమలగిరి : భారత విప్లవోద్యమంలో భూమి, భుక్తి, విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ అన్నారు. నవంబర్ 1 నుంచి 9 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాలు, వర్ధంతి సభల సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ ఆధ్వర్యంలో శని వారం నాగారం మండల పరిధిలోని ఈటూరులో అమరవీరుల స్థూపం వద్ద జెండావిష్కరించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను బలిదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు అంజయ్య, అంజయ్య, నాగరాజు, అంజయ్య, సోమన్న, పరశురాములు, వీరష్ పాల్గొన్నారు.
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి


