యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. వేకువజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. గర్భాలయంలో కొలువైన స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నిత్యతిరుకల్యాణ వేడుక ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


