
కోదాడలో మున్సిపల్ స్థలం కబ్జా
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
కోదాడ: సామాజిక అవసరాల కోసం కేటాయించిన 10శాతం స్థలాన్ని ఒకరు కబ్జా చేశారు. ఈ స్థలం మున్సిపాలిటీ పేరున రిజిస్ట్రేషన్ అయి ఉన్నా అవేమీ పట్టించుకోకుండా రేకుల షెడ్డు నిర్మించి ఆక్రమణకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల విలువైన స్థలం అన్యాక్రాంతమైనా అధికారులు పట్టించుకోవడంలేదు.
అసలు విషయం ఏమిటంటే..
కోదాడ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు, అంబేద్కర్ కాలనీ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాలుగు ఎకరాల స్థలాన్ని లే అవుట్ నంబర్ 2147/2012తో ప్లాట్లు చేశాడు. లే అవుట్‌లో సామాజిక అవసరాల కోసం 10 శాతం స్థలాన్ని కేటాయించాడు. ఈ స్థలాన్ని కోదాడ మున్సిపాలిటీ పేరుతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి కమిషనర్ రామానుజులరెడ్డి రిజిస్ట్రేషన్ సైతం చేయించాడు. నిబంధనల ప్రకారం ఈ లేఅవుట్ చేసిన వ్యాపారి అందులో రోడ్లను కూడా మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
షెడ్డు వేసి..
ఈ వెంచర్‌లో 1,211 గజాల స్థలాన్ని కోదాడ మున్సిపాలిటీ పేరుతో రిజిస్టేషన్ అయినప్పటికీ ఖాళీగా ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఒకరి కన్ను దీనిమీద పడింది. సదరు స్థలంలో రేకులషెడ్డు వేసి ఆక్రమణకు పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇటీవల ఇదే స్థలంలో అమృత 2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రజారోగ్యశాఖకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని కేటాయించే సమయంలోనైనా అధికారులు అక్కడ మున్సిపాలిటీకి ఉన్న స్థలం ఎంత..? వాటర్ ట్యాంక్‌కు ఎంత కేటాయిస్తున్నాం..? ఇంకా ఎంత స్థలం అక్కడ మిగిలింది.? అన్న వివరాలు కూడా తీసుకోలేదు. సదరు భూమి నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లుగా పెట్టిన తరువాత దానికి సంబంధించిన వివరాలు మొత్తం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. స్థలం ఆక్రమణకు గురి అవుతుందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
ఫ స్థలం విలువ రూ.కోట్లలోనే..
ఫ రేకుల షెడ్డు నిర్మించి దర్జాగా ఆక్రమణ
ఫ స్థానికులు ఫిర్యాదు చేసినాపట్టించుకోని అధికారులు
కోదాడ మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం విషయంపై విచారణ జరిపి కబ్జాకు గురైతే తగిన విధంగా చర్యలు తీసుకుంటాం.
–రమాదేవి, కోదాడ మున్సిపల్ కమిషనర్