
రాయితీ.. రాలేదు!
గ్యాస్ కనెక్షన్లు ఇలా..
భానుపురి (సూర్యాపేట): వంట గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన రాయితీ సొమ్ము రావడం లేదు. సుమారు ఐదారు నెలలుగా ఈ రాయితీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమకావడంలేరు. జిల్లాలో దాదాపు 6లక్షలకు పైగా సిలిండర్లకు సుమారు రూ.20కోట్ల వరకు సబ్సిడీ పెండింగ్‌లో ఉంది.
2024లో ఫిబ్రవరిలో ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది. గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందించే ఉద్దేశంతో 2024 ఫిబ్రవరిలో పథకాన్ని ప్రారంభించారు. సిలిండర్ నింపిన తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో ఈ సొమ్మును ప్రభుత్వం జమచేసేది. మొదట్లో బాగానే అందించినా.. రానురాను ఈ పథకం కింద గ్యాస్ రాయితీ రావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
మొదట్లోనే వర్తించని పథకం..
ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం పేరున ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి పథకం(రూ.500లకే గ్యాస్ సిలిండర్) కోసం దాదాపు 3,26,383 దరఖాస్తులు అందాయి. అయితే చాలామందికి అర్హత ఉన్నా దరఖాస్తులు నింపే సమయంలో అవగాహన లేమి కారణంగా ఈ పథకానికి దూరమయ్యారు. ఈ దరఖాస్తులు అందించిన వారిలోనూ చాలామందికి ఈ పథకం వర్తించకుండా పోయింది.
ఫ లబ్ధిదారుల అకౌంట్లలో జమకాని గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు
ఫ ఐదారు నెలలకు పైగా ఇదే పరిస్థితి
ఫ ఆరు లక్షలకు పైగా సిలిండర్లకు సుమారు రూ.20కోట్ల వరకు సబ్సిడీ పెండింగ్
ఈ ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు బండి జ్యోతి. సొంతూరు తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం. మహాలక్ష్మి పథకం ప్రారంభం అయ్యాక ఆమె ఆరుసార్లు గ్యాస్ నింపించింది. రెండుసార్లు మాత్రమే రాయితీ సొమ్ము జమ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లను అడిగితే రాలేదని చెప్పారు. ఇదీ.. జిల్లాలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల పరిస్థితికి నిదర్శనం.
జిల్లాలో మూడు కంపెనీలకు చెందిన 13 సాధారణ డిస్ట్రిబ్యూటర్లు, 12 గ్రామీణ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ 25 ఏజెన్సీల పరిధిలో 2,01,369 సింగిల్ కనెక్షన్లు, 65,146 డబుల్ సిలిండర్ కనెక్షన్లు, 55,537 దీపం కనెక్షన్లు, 44,322 ఉజ్వల కనెక్షన్లు, 43,701 సీఎస్‌ఆర్ కనెక్షన్లు.. ఇలా మొత్తం 4,10,075 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి 6 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో 8 సిలిండర్ల వరకు వినియోగిస్తుంటారు. ఈ లెక్కన ప్రతినెలా ఆయా ఏజెన్సీల ద్వారా 2లక్షల సిలిండర్లు జిల్లాకు సరఫరా అవుతుంటాయి. కాగా పథకం ప్రారంభమైన నాటినుంచి జిల్లాలో దాదాపు 5,52,043 సబ్సిడీ సిలిండర్లను పంపిణీ చేయగా.. రూ.15.26 కోట్లు సబ్సిడీ సొమ్ము జమచేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతినెలా జిల్లాలో 2లక్షల దాకా సిలిండర్లు సరఫరా అవుతుండగా.. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ల స్కీం అమలై దాదాపు 20 నెలలవుతోంది. కేవలం ఐదున్నర లక్షల మందికే ఈ పథకం కింద సిలిండర్లు అందించడంపై దీని అమలు తీరు అర్థమవుతోంది.

రాయితీ.. రాలేదు!