
నేరాల నివారణకు నాకా బందీ
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణకు నాకా బందీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం నిర్వహించిన నాకా బందీ కార్యక్రమాన్ని ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 23 ప్రాంతాల్లో నాకా బందీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అక్రమ రవాణా, అనుమానితులు, రౌడీషీటర్స్ కదలికలు, గంజాయి రవాణా చేసే వారి కదలికలు, పశువుల అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా నేరస్తుల కదలికలు గుర్తించి నివారించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐలు శ్రీకాంత్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
21న పోలీస్ ఫ్లాగ్ డే
ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజ రక్షణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ ఈనెల 21 నుంచి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలీస్ విధులు, టెక్నాలజీ వినియోగంపై పోలీస్ ఓపెన్ హౌజ్, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అమరవీరుల కుటుంబాల సందర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, అమర పోలీసులను స్మరిస్తూ క్యాండిల్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు ప్రతిభ తెలిపే లఘు చిత్రాల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు ఉంటాయని, డ్రగ్స్ నివారణలో పోలీసు పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశాలపై వ్యాసరచనపోటీలు ఉంటాయని వివరించారు.
ఫ ఎస్పీ నరసింహ