
యువతకే డీసీసీ అధ్యక్ష పదవి
తుంగతుర్తి : డీసీసీ అధ్యక్షుడి నియామకంలో యువతకే ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ తెలిపారు. మంగళవారం తుంగతుర్తిలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మొదట మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సారత్ రౌత్ మాట్లాడుతూ ఓబీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ, మహిళల నుంచి ఆరు పేర్లు ఏఐసీసీకి పంపిస్తామన్నారు. వారిలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేసే వారిని నియమిస్తారన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన , అందరినీ సమన్వయపరిచే వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామన్నారు.అనంతరం కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో పీసీసీ అబ్జర్వర్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పీసీసీ అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞాన సుందర్, పీసీసీ సభ్యుడు గుడిపాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, యోగానంద చార్యులు, పాలకుర్తి రాజయ్య, దొంగరి గోవర్ధన్, ఆకుల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
దామోదర్‌రెడ్డి మృతి బాధాకరం
మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చాలా బాధాకరమని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ పేర్కొన్నారు. మంగళవారం దామోదర్‌రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామోదర్ రెడ్డి కుమారుడైన ఏఐసీసీ సభ్యుడు రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు.
ఫ కాంగ్రెస్ అభివృద్ధికి కృషిచేసిన వారినే ఎంపిక చేస్తాం
ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్

యువతకే డీసీసీ అధ్యక్ష పదవి