
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : జిల్లాలో 2025 విద్యా సంవత్సరంలో 40 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ప్రతి పాఠశాల నుంచి తాత్కాలిక పద్ధతిలో ఒక ప్రైమరీ టీచర్, ఒక ఆయాను నియమించేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ టీచర్‌కు ఇంటర్మీడియట్, ఆయాకు 7వ తరగతికి విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థి అదే గ్రామ పంచాయితీ వారై ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులుపూర్తి చేసిన దరఖాస్తులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అందజేయాలని కోరారు.
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి
నూతనకల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా వైద్య సిబ్బంది పాటు పడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ పీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి లిఖిత్, సీహెచ్‌ఓ శరణ్‌నాయక్, ప్రియాంక, శిరీష, దీపిక, మనీషా, సుమాంజలి, అనూ హ్య, ఉషారాణి, ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ రెండో దశకు బీఎన్ పేరు పెట్టాలి
సూర్యాపేట అర్బన్: ఎస్సారెస్పీ రెండో దశకు దివంగత మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టు సాధన కోసం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట్ నరసింహారెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు నీరు అందించడానికి కృషి చేశారన్నారు. సమావేశంలో కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, రాంబాబు, మడ్డిఅంజిబాబు, షేక్ జహంగీర్ పాల్గొన్నారు.
బృందాల ఏర్పాటును విరమించుకోవాలి
సూర్యాపేటటౌన్ : పాఠశాలల తనిఖీకి బృందాల ఏర్పాటును విరమించుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కొచ్చర్ల వేణు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తనిఖీ బృందాల స్థానంలో ఎంఈఓలు, డిప్యూటీ ఈఓ, డీఈఓలను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు. బృందాల పేరుతో ఉపాధ్యాయులను బడికి దూరం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం శోచనీయమన్నారు.

మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం