
చివరిగింజ వరకు ధాన్యం సేకరించాలి
భానుపురి (సూర్యాపేట) : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వానాకాలం 2025–26 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్‌పీఓ, మెప్మా శాఖలకు చెందిన కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 158, పీఏసీఎస్ 122, ఎఫ్‌పీఓ 15, మెప్మా 13 ఇలా మొత్తం 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతంలో ఉండకుండా ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో వేయింగ్ మిషన్, విద్యుత్, తాగునీరు, ఫ్లెక్సీపై నిర్వాహకుల పేరు ఫోన్ నంబర్, టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు, డ్రయ్యర్లు, ట్యాబ్ లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు గడ్డి, తాలు, దుమ్ము లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. మండలాల వారీగా షెడ్యూల్ తయారుచేసి ఎం ఎల్ ఎస్ పాయింట్ నుంచి కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎస్‌ఓ మోహన్ బాబు, డీఎం రాము, డీసీఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్