
వందశాతం ఉత్తీర్ణతే పరమావధి
అభ్యాస దీపికలతో సన్నద్ధం
లక్ష్యం సాధించేలా చూడాలి
నాగారం : పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సెప్టెంబర్–1 నుంచి జిల్లా పరిషత్, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. డిసెంబర్ నెలాఖరు వరకు సాయంత్రం వేళ, ఆ తర్వాత 2026 జనవరి–1వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
నిర్వహణ ఇలా...
ఈ ఏడాది జిల్లాలో 5,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతి నిర్వహించడం, ముఖ్యమైన అంశాలను చదివించడం, విద్యార్థులు వెనుకబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు31వ తేదీ వరకు సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు ప్రతిరోజు ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అలాగే జనవరి–1 నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు చేపట్టనున్నారు. విద్యారులు తప్పనిసరి హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తూ..... వారి ప్రగతి పై చర్చించాలి. హెచ్‌ఎంలు పర్యవేక్షిస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆయా సామర్థ్యాల ఆధారంగా లఘు పరీక్షలు పెట్టాలి. విద్యార్థుల జవాబు లను పరిశీలించి చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉత్తమ ఫలితాల సాధన దిశగా ప్రేరణ కల్పిస్తున్నారు. వచ్చే జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి వారం ఒక్కో పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించి ప్రతిభను అంచనా వేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.
గతేడాది ఉత్తీర్ణత...
2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 96.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. ఈసారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఫ కొనసాగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులు
ఫ డిసెంబర్ వరకు సాయంత్రం వేళ
ఫ జనవరి నుంచి రెండు పూటలా...
ఫ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. ఎస్‌సీఈ ఆర్టీ రూపొందించిన అభ్యాస దీపికలతో విద్యార్థులను సన్నద్ధం చేయిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు అవసరమైతే ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
పదోతరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలి. ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలి. పర్యవేక్షణ అధికారులతో సలహాలు, సూచనలు సేకరించాలి. సబ్జెక్టు టీచర్లు సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు శ్రమించాలి.
–అశోక్, డీఈఓ, సూర్యాపేట.
జెడ్పీ ఉన్నత పాఠశాలలు 182
కేజీబీవీలు 18
ఆదర్శ పాఠశాలలు 09
పదవ తరగతి విద్యార్థుల సంఖ్య 5,345

వందశాతం ఉత్తీర్ణతే పరమావధి