
పొరపాట్లకు తావివ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా నామినేషన్ల సందర్భంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొదటి విడత సూర్యాపేట డివిజన్‌లోని 11 మండలాల్లో 112 ఎంపీటీసీ స్థానాలు, రెండో విడత కోదాడ, హుజూర్‌నగర్ డివిజన్లలోని 12 మండలాల్లో 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడతన అక్టోబర్ 9న, రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ ట్రైనర్ రమేష్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియపై పూర్తిస్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
మాక్ డ్రిల్..
నామినేషన్ల స్వీకరణ, నోటిఫికేషన్ జారీలో ఎలాంటి తప్పులు, కొట్టివేతలు, దిద్దిబాట్లు ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం 9వ తేదీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు, ఓటరు జాబితా సైతం ప్రచురించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని మండలాల ఆర్‌ఓలు, సహాయ రిటర్నింగ్ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, స్వీకరించాల్సిన ధ్రువపత్రాలు ఇతర అన్ని అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎఫ్‌ఓ సతీష్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్