
ఉపాధిహామీలో ‘జియో ఫెన్సింగ్’
అక్రమాలకు చోటు ఉండదు
నాగారం : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణలో ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానం అమలులోకి తెచ్చింది. పనుల విషయంలో అవకతవకలకు తావులేకుండా పక్కాగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కూలీల హాజరు నమోదులో అక్రమాలు చోటుచేసుకోకుండా పనుల వద్ద ఎక్కడి నుంచైనా కూలీల హాజరు తీసుకునేలా జియో ఫెన్సింగ్ విధానం అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ముఖగుర్తింపు, ఈకేవైసీ..
ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని..పనుల వద్ద బోగస్ కూలీల హాజరు నమోదును అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. దీని నివారణకు ఇప్పటికే ముఖ గుర్తింపు హాజరు విధానం, ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో ఒకరి బదులు మరొకరు పనులకు వెళ్లడం, క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్లు తమకు సంబంధించిన వ్యక్తులను పనులకు హాజరుకాకున్నా హాజరు వేయడం వంటి వాటిని గుర్తించి ఈకేవైసీ అమలులోకి తెచ్చారు. తాజాగా ఈ జియో ఫెన్సింగ్ విధానంతో పని ప్రారంభించిన తర్వాత ఎంతదూరంలో పనులు చేస్తున్నా ఒకేచోట ఉండి కూలీల హాజరును గుర్తించేలా కొత్తగా సాంకేతిక విధానం తెచ్చారు.
పని ప్రాంతంలో ఎక్కడినుంచైనా...
పనిచేస్తున్న ప్రాంతంలో ఎక్కడినుంచైనా హాజరు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. జియో ఫెన్సింగ్ అమలుతో కూలీల హాజరు నమోదు వేగవంతంగా తీసుకోవచ్చు. గతంలో పని ప్రారంభించిన చోట జియోట్యాగింగ్ చేసిన చోటనుంచే కూలీల హాజరు తీసుకునేవారు. కొత్త విధానంతో పనిచేసే ప్రాంతం మొత్తం జియోట్యాగింగ్ చేస్తారు. అప్పుడు మ్యాప్ లొకేషన్‌తో హాజరు ఎక్కడినుంచైనా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
కూలీల హాజరు నమోదులో
అక్రమాలకు చెక్ పెట్టేలా..
కొత్త సాంకేతిక విధానం
తీసుకొచ్చిన ప్రభుత్వం
పని ప్రాంతంలో ఎక్కడినుంచైనా హాజరు తీసుకునే అవకాశం
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఒకేచోట ఉండి పని ప్రదేశమంతా ఉన్న కూలీల హాజరు వేగవంతంగా తీసుకునేందుకు ఈ కొత్తవిధానం అమలు చేస్తున్నాం. జియో ఫెన్సింగ్‌తో పనులు పారదర్శకంగా జరగనున్నాయి.
– వీ.వీ.అప్పారావు, డీఆర్డీఓ
వంద రోజులు పనిచేసిన కుటుంబాలు 36

ఉపాధిహామీలో ‘జియో ఫెన్సింగ్’