
పెసరకు మద్దతు ధర కరువు
తిరుమలగిరి (తుంగతుర్తి): వానా కాలంలో పెసర పంట వేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఆగస్టులో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పెసర పంట దెబ్బ తిన్నది. దీనికి తోడు ప్రభుత్వం పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. పచ్చగా నిగనిగలాడాల్సిన గింజలు వర్షాలకారణంగా నల్లగా మారాయి. చేతికి వచ్చిన పంటను మార్కెట్‌కు తీసుకెళితే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇటు తక్కువ ధరకు అమ్ముకోలేక, ఇంట్లో దాచుకోలేక పెసర రైతులు విలవిలలాడుతున్నారు.
తగ్గిన దిగుబడి
ఈ వానా కాలంలో జిల్లాలో 911 ఎకరాల్లో పెసర సాగు చేశారు. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఈ పంట అధికంగా వేస్తారు. అయితే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా పెసర్లు వస్తాయి. సాధారణ రైతు పెసర సాగుకు ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు పెట్టాడు. పంట చేతికొచ్చే దశలో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బ తిన్నది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2, 3 క్వింటాళ్లకే పరిమితమైంది. దీనికి తోడు రంగు మారడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ఆగస్టు నెల ప్రారంభం నుంచి పెసర్లు వస్తున్నాయి. ప్రభుత్వం క్వింటా పెసరకు మద్దతు ధర రూ.8,768 నిర్ణయించింది. అయితే గింజలు బాగాలేవంటూ మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు రూ.3 వేల నుంచి రూ.6 వేల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అకస్మాత్తుగా వర్షాలు వస్తుండటంతో ఆరబెట్టిన గింజలు తెల్లగా మారుతున్నాయి. చేసిన కష్టాన్ని దాచుకునే వీలు లేక, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించలేక రైతులు దిగులు చెందుతున్నారు. మరి కొందరు రైతులు బస్తాల్లో పోసి ఇళ్లలోనే భద్రపరుస్తున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ఇప్పటి వరకు 2753 క్వింటాళ్ల, సూర్యాపేట మార్కెట్‌కు 2400 క్వింటాళ్ల పెసర్లు వచ్చాయి. క్వింటాకు గరిష్టంగా రూ.6,692 ధర, కనిష్టంగా రూ.3,300 ధర పలికింది.
ఫ కొనుగోలు కేంద్రాలనుప్రారంభించని ప్రభుత్వం
ఫ ప్రైవేట్‌లో అమ్ముకుంటున్న రైతులు
ఫ మద్దతు ధర క్వింటాకు రూ.8,768
ఫ గరిష్టంగా రూ.6,692 మాత్రమేపెట్టి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు