
ఫ్రీడమ్ పార్కు.. ఆహ్లాదానికి దూరం
అధికారులపై చర్యలు తీసుకోవాలి
కోదాడ: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును మున్సిపాలిటీ అధికారులు పిచ్చిమొక్కల పాలు చేశారు. రూ.10లక్షలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు మున్సిపల్, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఆనవాళ్లు కోల్పోయింది.
రెండేళ్ల క్రితం ఏర్పాటు
ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెండేళ్ల క్రితం కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఫ్రీడమ్ పార్క్‌ను మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. దీని కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి బస్టాండ్ అవుట్‌గేట్‌కు ఇరువైపులా, దుకాణ సముదాయానికి వెనుక వైపున ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాటిలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ మొక్కలకు నీరు పెట్టడానికి మరో రూ.3 లక్షలు ఖర్చు చేసి పొలీస్‌స్టేషన్ సమీపం నుంచిపైప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు. నాసిరకంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కొద్ది రోజులకే పాడైపోయింది. సంరక్షణను విస్మరించడంతో పార్కులోని మొక్కలన్నీ చనిపోయాయి. ప్రస్తుతం ఫ్రీడమ్‌పార్కు పిచ్చిమొక్కలతో నిండి ఆనవాళ్లు కోల్పోయింది. ప్రస్తుతం అక్కడ కేవలం బోర్డు మాత్రమే కనిపిస్తోంది.
రెండు శాఖల మధ్య సమన్వయ లోపం..
ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు నిర్వహణ విషయంలో మున్సిపల్ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్కు ఏర్పాటు చేయడం వరకే తమ పని అని.. నిర్వహణను మాత్రం ఆర్టీసీ అధికారుల చూసుకోవాలని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అడిగారని తాము స్థలం ఇచ్చామని, పార్కు ఏర్పాటు చేసింది వారే కాబట్టి నిర్వహణ బాధ్యతలు కూడా వారే చూసుకోవాలి. పార్కు నిర్వహణకు తమ వద్ద ప్రత్యేకంగా సిబ్బంది లేరని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో పార్కు పిచ్చిమొక్కలకు, మల మూత్ర విసర్జనకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఫ రూ.10లక్షలతో కోదాడ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు
ఫ నిర్వహణను పట్టించుకోని మున్సిపల్, ఆర్టీసీ అధికారులు
ఫ ధ్వంసమైన ఫెన్సింగ్.. పిచ్చి మొక్కలకు నిలయం
ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బును దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఫ్రీడమ్‌పార్కు విషయంలో ఎక్కడ తప్పిదం జరిగిందో విచారించి బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబట్టాలి. కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలి.
– పొడుగు హుస్సేన్,పట్టణ పన్ను చెల్లింపుదారుల సంఘం అధ్యక్షుడు.