
దరఖాస్తులు పరిశీలించి నోటీసులు జారీచేయాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు సూచించారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో గురువారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం 2014 జూన్ 2వ తేదీకి ముందు కాగితం రాసుకొని కొనుగోలు చేసి 2020 అక్టోబర్‌లో మీ–సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఉండి 12 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న వారివి మాత్రమే పరిశీలించాలని ఆదేశించారు. తహసీల్దార్లు రెవెన్యూ గ్రామాల వారీగా దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, రోడ్లు, ఇంకా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూముల వివరాలతో కూడిన 22– ఏ రిజిస్టర్‌ను త్వరగా సమర్పించాలన్నారు. అలాగే అన్ని రకాల ప్రభుత్వ భూములను జియో ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో భూమి పటం తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ లు, తహసీల్దార్లు, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ సాయి గౌడ్, డీటీ వేణు, అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు