
జానియర్ కాలేజీల్లో ‘పీటీఎం’
ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం
ప్రభుత్వ కళాశాలల్లో పీటీఎం అమలుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం మరింతగా పెరిగే అవకాశం ఉండనుంది. అధ్యాపకులతో తల్లిదండ్రులు సమావేశం కావడం ద్వారా విద్యార్థుల సమగ్ర విషయాలు తెలుస్తాయి. దీంతో వారికి కూడా కాలేజీ నియమ నిబంధనల పట్ల విద్యార్థుల చదువుల పట్ల అవగాహన పెరుగుతుంది.
– భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట
హుజూర్‌నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచి ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాల్లో మాదిరిగా జూనియర్ కళాశాలల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కొంత మేర తగ్గుతూ రావడం.. ఉత్తీర్ణత శాతం కూడా ఆశించిన మేరకు పెరగకపోవడంతో వాటిని అధిగమించేందుకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని..
గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించే వారు. అది కూడా మొక్కుబడిగా జరిగేది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించేలా ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు ఉత్తీర్ణత శాతం మరింతగా మెరుగు పడుతుందని అధ్యాపకులు భావిస్తున్నారు.
జిల్లాలో ఎనిమిది కళాశాలలు
జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 3,003 విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,559 మంది.. రెండో సంవత్సరం 1,444 మంది ఉన్నారు.
పిల్లల పరిస్థితి తెలిపేలా..
ఇక నుంచి ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి కూడా తల్లిదండ్రులకు తెలియనుంది. అధ్యాపకులు సెల్‌ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించే తేదీ, సమయం తెలియజేస్తూ వారి పిల్లల చదువుల తీరును కూడా వివరిస్తారు. వారు ఏ దశలో ఉన్నారు, ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడ్డారు, కళాశాలకు క్రమం తప్పకుండా వస్తున్నారా తదితర విషయాలను తల్లిదండ్రులతో చర్చిస్తారు. దీనిని పక్కాగా అమలు చేసేలా ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.
ఫ హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు కార్యాచరణ
ఫ ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్
నిర్వహించాలని నిర్ణయం
ఫ ఈ ఏడాది నుంచే అమలుకు ఆదేశాలు

జానియర్ కాలేజీల్లో ‘పీటీఎం’