
తల్లిదండ్రుల రుణం తీర్చలేనిది
భానుపురి (సూర్యాపేట) : తల్లిదండ్రుల రుణం తీర్చలేనిదని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తు సాంకేతిక యుగంలో తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని బాగా చదివించాలని, వారు ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలనే కోరిక ఉంటుందని తెలిపారు. పిల్లలను భావి భారత పౌరులుగా తయారు చేయడంలో తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
సుప్రీం కోర్టులో పిటిషన్ చేయడం సరైంది కాదు
సూర్యాపేట : రాష్ట్రంలోని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం సరైనది కాదని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లూనావత్ పాండు నాయక్, జిల్లా అధ్యక్షుడు నాగునాయక్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1976 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలోని ఎస్టీలుగా ఉన్న లంబాడీలు, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనడం హేయమైన చర్యల అన్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బంజారా సేవా సంఘ్ జిల్లా గౌరవ సలహాదారుడు పోరియా నాయక్, ఉపాధ్యక్షుడు ధరావత్ సోమ్లా నాయక్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ గుగులోతు వీరన్న నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి సాయి నాయక్, పవన్ నాయక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సభను జయప్రదం చేయాలి
తుంగతుర్తి: హుజూర్‌నగర్‌లో ఆగస్టు 1న జరిగే చేయూత పింఛన్‌దారుల నియోజకవర్గ స్థాయి సన్నాహక సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు, వీహెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసీం కోరారు. ఆదివారం తుంగతుర్తిలో గుండాల కొమురయ్య అధ్యక్షతన జరిగిన ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.6వేలు, చేయూత పింఛన్‌దారులకు 2016 నుంచి రూ.4016లకు, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 వేలకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సభకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు యాతకుల రాజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్‌బాబు మాదిగ, కళామండలి జిల్లా అధ్యక్షుడు గంట భిక్షపతి మాదిగ, నాయకులు చింత సతీష్, జలగం శ్రీరాములు, జలగం సైదులు, జటంగి వెంకన్న, మండల ఇన్‌చార్జి చెడుపాక బోస్, తోట శ్రీరాములు, బొంకూరి వెంకన్న, యాదగిరి, మడిపెద్ది మంగమ్మ, పోలెపాక మధు తదితరులు పాల్గొన్నారు.