
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట అర్బన్ : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, హుజూర్‌నగర్ పట్టణా ల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సహకరిస్తున్న లంచగొండి అధికారులను గుర్తించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ఉపాధ్యక్షురాలు రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు కల్పన, పద్మ, రేణుక, గౌరమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.