
పశువుల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కోదాడరూరల్ : పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో సత్యసాయి సేవా ట్రస్ట్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని కోరారు. పాడి రైతులు తప్పనిసరిగా పచ్చిమేతను సాగు చేసుకోవాలన్నారు. పశువులు ఈనిన మూడు నెలల్లోపే తిరిగి కృత్రిమ గర్భధారణ చేయించాలన్నారు. పశువులు వెంటనే సూడి కడితే ఏడాది లోపు తిరిగి మరో దూడను ఇవ్వడంతో పాటు పాల ఉత్పత్తి కొనసాగుతుందని, మేత ఖర్చు కూడా తప్పుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు, ఖనిజ లవణ మిశ్రమాన్ని రైతులకు అందజేశారు. కార్యక్రమంలో కోదాడ ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, సేవా సమితి సేవకులు, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, డాక్టర్స్ బి.మధు, కె.వీరారెడ్డి, శ్రీనివాస్, మమత, హరిత, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర, సేవాసమితి జిల్లా ఇన్‌చార్జ్ బాబురావు, సిబ్బంది ఉన్నారు.
ఫ జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు