
మెనూ ప్రకారం భోజనం అందించాలి
సూర్యాపేట : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. శనివారం సూర్యాపేట మండలం బాలెంలలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలను తనిఖీ చేశారు. ఈ సందర్భగా బియ్యం నాణ్యత, స్టాక్ వివరాలు, కూరగాయలు, వంట సామగ్రితో పాటు వంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దు
నూతనకల్: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ సూచించారు. శనివారం నూతనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు వెంకెపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో ఆరోగ్య సంరక్షణ టీకాలు వేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
641 అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 20 రోజులుగా నిలకడగా ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 641 అడుగులకు చేరింది. రెండు రోజుల నుంచి మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీకి వరద రాక ప్రారంభమైంది. శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 280 క్యూసెక్కుల నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం(4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టులో.. శనివారం సాయంత్రం నాటికి 641.60 (3.58 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఆవిరితో పాటు, సీపేజి, లీకేజీ రూపంలో 68 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని అధికారులు పేర్కొన్నారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి