
ఇసుక ఉచితమే..
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
ఎక్కడ ఉంటే అక్కడి నుంచి..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమకు సమీపంలో వాగులు, వంకలు, చెరువులు, చెక్ డ్యాంలు ఇలా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి ఇసుక పొందడానికి అవకాశం కల్పించారు. అంతకు ముందు కలెక్టర్ ఇసుక లభ్యత ప్రాంతాలపై సర్వే చేయించి వాటిని గుర్తించారు. లబ్ధిదారులకు అనుకూలమైన ప్రాంతం నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. స్థానిక వాగుల్లో ఇసుక లేనట్లయితే క్వారీల నుంచి కూడా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. స్థానిక మండలంలో ఇసుక లేకపోతే పక్క మండలం నుంచి తీసుకోవచ్చు.
సూర్యాపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులపై ఆర్థికభారం పడకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 4,322 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఇసుక రవాణా చార్జీలు మాత్రం లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది.
జిల్లాలో 4,322 ఇళ్లు మంజూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పేదల సొంటికలను నెరవేర్చడానికి పూనుకుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో గృహ నిర్మాణశాఖను బలోపేతం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4,322 ఇళ్లు మంజూరు చేసింది. అందులో మొదటి విడతలో 1,210 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక్కో ఇంటికి 6 నుంచి 10 కూపన్లు..
ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం 6 నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇసుకను అధికారుల అనుమతి ద్వారా తెచ్చుకోవాలి. తొలుత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అవసరమైతే పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరిస్తారు. పని జరిగింది లేనిది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అనుమతి ఇస్తారు. వీరిచ్చేధ్రువీకరణ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్ అనుమతి కూపన్లు అందజేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా లబ్ధిదారు తమకు అనుకూలంగా ఉన్న చోట నుంచి ఇసుకను తెచ్చుకోవచ్చు. మొదట ఆరు కూపన్లు జారీ చేస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి ఇసుక ఇస్తారు. మార్కెట్‌లో ఇసుక ధరను బట్టి చూస్తే రూ.25వేల నుంచి 30 వేల వరకు ఆదా అవుతాయి.
లబ్ధిదారులకు తప్పనున్న ఆర్థికభారం
ఫ రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు ఆదా
ఫ రవాణా ఖర్చులు మాత్రం భరించాల్సిందే..
ఫ తొలివిడతలో నిర్మాణ దశలో 1,210 ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు ప్రయోజనకరం
లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందజేస్తాం. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేస్తే దాన్ని తహసీల్దార్ పరిశీలించి లబ్ధిదారులకు అనుకూలంగా ఉన్న వాగులు, వంకల నుంచి లేకపోతే ఇతర మండలాల్లో గుర్తించిన ప్రదేశాల నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తూ కూపన్లను జారీ చేస్తారు. ఇది లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
– ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
మొత్తం మంజూరైన ఇళ్లు 4,322
తొలివిడత పనులు
ప్రారంభమైనవి 1,210
వీటిలో బేస్‌మెంట్ లెవల్ 796
వాల్ లెవల్ 276
స్లాబ్ లెవల్ 106