
యూనిఫామ్ సిద్ధమవుతోంది
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి అందించేందుకు విద్యాశాఖ యూనిఫామ్ సిద్ధం చేయిస్తోంది. ప్రభుత్వం ఏటా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫామ్ అందజేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రతి విద్యార్థికి ఒక్కో జత యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గడిచిన విద్యా సంవత్సరం ముగిసే నాటికే వస్త్రం పంపిణీ చేసింది. గతంలో తరగతులు మొదలైన తర్వాత కూడా దుస్తులు అందించలేదు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా దుస్తుల కుట్టే బాధ్యతను ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మున్సిపాలిటీ పరిధిలో మెప్మా సిబ్బంది, గ్రామాల్లో వీఓఏలు ప్రతి విద్యార్థి కొలతలను సేకరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 50శాతం వరకు కుట్టుపని పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
49,374 మంది విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు మొత్తం 950 ఉన్నాయి. వీటిలో బాలురు 23,547 మంది విద్యనభ్యసిస్తుండగా బాలికలు 25,827 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక్కో జత చొప్పున 49,374 జతలు కుడుతున్నారు. అయితే ఇప్పటి వరకు 24,579 జతలు పూర్తయ్యాయి. మిగతావి కూడా ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండో జత వస్త్రం కూడా వస్తుందని.. వాటి కుట్టుపని కూడా జూన్ 10వ తేదీలోపు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
ఒక్కో జతకు
రూ.75 కుట్ట్టు కూలి..
విద్యార్థుల యూనిఫామ్ ఒక్కో జత కుట్టు కూలి కింద మహిళా సంఘాల సభ్యులకు రూ.75 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో రూ.50 మాత్రమే ఇవ్వడంతో కూలి గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ప్రభుత్వం గత విద్యాసంవత్సరం రూ.25 పెంచింది. దీంతో ఒక్కో జత రూ.75 ఇస్తున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా కొంత తోడ్పాటుకానుంది.
పాఠశాలల పునఃప్రారంభం
రోజే అందిస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫామ్ కూడా అందించేందుకు సన్నద్ధ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కో జత చొప్పున వస్త్రం రాగా కుట్టే పని కూడా 50శాతంపైగా పూర్తయ్యింది. ఈ నెల 31వ తేదీ లోపు మొదటి జత పూర్తి చేయిస్తాం. రెండో జత కూడా త్వరలో వస్తుంది. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిపామ్ అందజేస్తాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
ఫ ఇప్పటికే 50 శాతం కుట్టుపని పూర్తి
ఫ మిగతావి 31లోగా పూర్తి చేయాలని అధికారుల ఆదేశం
ఫ పాఠశాలలు తెరిచే నాటికి
అందించేలా ప్రణాళిక
ఫ మొదటి విడతలో ఒక్కో జత
పంపిణీకి ఏర్పాట్లు

యూనిఫామ్ సిద్ధమవుతోంది