
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు
సూర్యాపేటటౌన్ : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని జిల్లా ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని పేర్కొన్నారు. సంబంధిత అధికారులంతా సమన్వయంగా పనిచేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నిర్మూలనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉందని, ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి
సూర్యాపేట అర్బన్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్‌కౌంటర్ చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై ప్రధాని, హోంమంత్రి హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.
మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి పూజలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమం అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ వేడుక జరిపి నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం కృష్ణమ్మ తల్లికి ప్రహ్లాద్‌ఘాట్‌లో అర్చకులు హార తిపూజలు చేశారు.
30న తలనీలాలకు బహిరంగ వేలం
మట్టపల్లి క్షేత్రంలో భక్తులు సమర్పించే తలనీలాల సేకరణకు ఈనెల 30న ఆలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. ఏడాది కాలం తలనీలాల సేకరణకు నిర్వహించే ఈ వేలంకు రూ.4లక్షలు డిపాజిట్‌గా చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
గరిడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ అశోక్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదు రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచుకొని పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఛత్రునాయక్, ఎంఆర్పీలు ఆర్.రాంబాబు, సైదులు, రవీందర్, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, రాంబాబు, సీఆర్పీలు రామకృష్ణ, అశోక్, రాములు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు