
సెర్ప్ ఉద్యోగుల బదిలీలు?
నల్లగొండ : పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో బదిలీలకు రంగం సిద్ధమైంది. దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేయడానికి రాష్ట్రస్థాయిలో నిర్ణయం జరిగింది. నిబంధనల ప్రకారం 30 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, వంద శాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎంత మంది, ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలి.. తదితర అంశాలపై శనివారం సెర్ప్ అధికారులు రాష్ట్రస్థాయిలో యూనియన్ నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.
యాదగిరీశుడికి
లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి.