
విద్యాప్రమాణాలు మెరుగుపడేలా..
తాళ్లగడ్డ (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడంతోపాటు పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు, బోధనలో నాణ్యత, సాంకేతికత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలకు అర్థవంతమైన బోధన చేసేలా ఉపాధ్యాయులు నైపుణ్యాభివృద్ధి సాధించేలా ఈ వేసవి సెలవుల్లోనే వృత్యంతర శిక్షణ ఇప్పిస్తోంది. ఉపాధ్యాయుల్లో సామర్థ్య నిర్మాణం మెరుగుపరిచే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లాకేంద్రానికి సమీపంలోని దురాజ్‌పల్లిలో గల స్వామినారాయణ గురుకుల పాఠశాలలో 84 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్‌పీల) సమక్షంలో ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణ శనివారంతో ముగియనుంది.
శిక్షణ ఇలా..
జిల్లాలో విడతల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించారు. మొదటి విడతలో కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే ఈ నెల 20 నుంచి సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాలను డీఆర్‌పీలు తర్ఫీదు ఇచ్చారు. ఈ రెండవ విడత శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. అలాగే మండల స్థాయి ఉపాధ్యాయులకు ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడవ విడతలో హెచ్‌ఎంలకు నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ ఉండనుంది.
నైపుణ్యాభివృద్ధి.. సందేహాల నివృత్తి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌లో ధారాళంగా చదవడం రాయడంతోపాటు చతుర్విద ప్రక్రియల్లో పట్టు సాధించేలా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించారు. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న కృత్రిమ మేధ (ఏఐ) పాఠాలు అందిపుచ్చుకోవడం, విద్యార్థుల హాజరు శాతం పెంపు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడంతో బాటుగా ఆకర్షణీయమైన బోధన మెలకువలు నేర్పించారు. బోధనోపకరణాలు, ఉపాధ్యాయులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేశారు.
ఈ శిక్షణలో భాగంగా పాఠశాల అభివృద్ధికి వచ్చే నిధులను సక్రమంగా, సమర్థవంతంగా ఉపయోగించడం, కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందిస్తూ తరగతులు నిర్వహించేలా పలు రకాల పద్ధతులను వివరించారు.
బోధన సామర్థ్యాలు మెరుగు
సహజంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారితో మెరుగైన బోధన ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న వృత్యంతర శిక్షణ వల్ల బోధనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. విద్యార్థుల లోపాలను సరిదిద్దుతూ సమర్థవంతంగా బోధించవచ్చు.
– గుండు అంజనీకుమార్, ఉపాధ్యాయుడు
చాలా విషయాలు నేర్చుకున్నాం..
వృత్యంతర శిక్షణలో చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా సాంకేతిక ప్రమాణాలు పెంపొందించే పలు రకాల పద్ధతులను వివరించాలి. తరగతి గదిలో పిల్లల మానసిక స్థితిని బట్టి ప్రయోగాత్మకంగా బోధిస్తే చదువుపై ప్రత్యేక దృష్టిసారిస్తారు.
– జోగం నరేష్, ఉపాధ్యాయుడు
ఫ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాభివృద్ధి..
ఫ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు
పెంపే లక్ష్యంగా
ఫ ఐదు రోజులుగా టీచర్లకు శిక్షణ
ఫ నేటితో ముగియనున్న ప్రక్రియ
ఉపాధ్యాయులు4,016
ప్రభుత్వ పాఠశాలలు
1,050
విద్యార్థులు 1,24,000

విద్యాప్రమాణాలు మెరుగుపడేలా..

విద్యాప్రమాణాలు మెరుగుపడేలా..