ఎన్‌క్వాస్‌ గుర్తింపు కష్టమే! | - | Sakshi
Sakshi News home page

ఎన్‌క్వాస్‌ గుర్తింపు కష్టమే!

May 24 2025 1:00 AM | Updated on May 24 2025 1:00 AM

ఎన్‌క్వాస్‌ గుర్తింపు కష్టమే!

ఎన్‌క్వాస్‌ గుర్తింపు కష్టమే!

నాగారం : పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌(ఆమ్‌) ఉప కేంద్రాలు ఎన్‌క్వాస్‌ (నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌–జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు) గుర్తింపు పొందడానికి నిధుల కొరత ఏర్పడింది. ఆయా కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో కొన్నింటికి ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభించడం గగనంగా మారింది. అయితే ఎన్‌క్వాస్‌ బృందం తనిఖీల సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో మందులు నిల్వ ఉండాలి. మందులకు, వైద్యుడు, ఫార్మాసిస్ట్‌, ఏఎన్‌ఎంలకు గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కేంద్రాల్లో అందించే వైద్యసేవలు, వ్యర్థాలు, టీకాల నిర్వహణ, గర్భిణుల గుర్తింపు, మందుల పంపిణీ, కేంద్రం ఆవరణలో పచ్చదనం, జాతీయ పథకాల అమలు తీరుతోపాటు తదితర అంశాలు పక్కాగా ఉండాలి. ఇందుకుగాను ఒక్కో కేంద్రానికి కనీసం రూ.50 వేల నిధులు అవసరం. అయితే ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో జూన్‌లో ఎన్‌క్వాస్‌ బృందం తనిఖీలు చేయనుంది. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు కొన్ని కేంద్రాలను తీర్చిదిద్దలేని దుస్థితి నెలకొంది.

25 కేంద్రాలకు అవకాశం

జిల్లాలో 166 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా ప్రస్తుతం 25 కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపునకు అనుమతి లభించింది. వీటిలో ఇప్పటివరకు నాలుగు పీహెచ్‌సీలు, రెండు యూపీహెచ్‌సీలు, మరో రెండు ఆయుష్మాన్‌ మందిర్‌ (ఆమ్‌) ఆరోగ్య ఉప కేంద్రాలు ఎన్‌క్వాస్‌ గుర్తింపును పొందాయి. మిగతా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ ఉప కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు పొందేలా అన్ని హంగులతో తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రస్తుతం మోతె మండలం బుర్కచర్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని జూన్‌–3, గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని జూన్‌–6న తనిఖీలు నిర్వహిస్తామని ఎన్‌క్వాస్‌ బృందం నుంచి సమాచారం అందించింది. మిగతా వాటికి అన్ని హంగులతో ఏర్పాట్లు పూర్తిచేశాక తనిఖీలు చేయనుంది.

గుర్తింపు పొందితే ప్రయోజనాలివే..

ఎన్‌క్వాస్‌ గుర్తింపు పొందితే పీహెచ్‌సీలకు ఏడాదికి రూ.3లక్షలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ ఉప కేంద్రాలకు రూ.1.25 లక్షలు, యూపీహెచ్‌సీలకు రూ.2లక్షల చొప్పున మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుంది. అనంతరం గుర్తింపు రెన్యువల్‌ పొందితే మరో మూడేళ్లు ఈ సా యం అందిస్తారు. కేంద్రం అందించే సాయంలో 75 శాతం నిధులు కేంద్రాల నిర్వహణ, అత్యవసర మందుల కొనుగోళ్లు, తాగునీటి వసతి ఏర్పాటు, పచ్చదనం, పరిశుభ్రత తదితరాలకు వ్యయం చేస్తూ మెరుగైన వైద్యం అందించటానికి ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. మిగతా 25శాతం సిబ్బంది మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ప్రోత్సాహకాలు అందించటానికి వీలు కల్పించారు.

ఫ ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యతా

ప్రమాణాలు కరువు

ఫ నిధుల లేమితో సమకూరని సౌకర్యాలు

ఫ 25కు గాను 8 కేంద్రాలకే గుర్తింపు

ఫ సందిగ్ధంలో మిగతా కేంద్రాలు

ఫ జూన్‌లో తనిఖీలు ప్రారంభం

జిల్లాలోని పీహెచ్‌సీలు 18

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 07

బస్తీ దవాఖానాలు 04

ఆయుష్మాన్‌ ఆరోగ్యకేంద్రాలు 166

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement