
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్ట్
ఆత్మకూరు (ఎస్): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరపర్చారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరి గ్రామానికి చెందిన రావుల నరేష్ ప్రేయసికి అదే గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య లేనిపోని మాటలు చెప్పడంతో ఆమె నరేష్ దూరం పెడుతూ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ తన చావుకు కారింగుల లింగయ్యే కారణమని సెల్ఫీ వీడియో తీసి గత నెల 27న మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో పురుగుల మందు తాగాడు. అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అదే నెల 28వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై సిరోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఈ నెల 14న కేసును ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ దర్యాప్తు చేసి నరేష్ ఆత్మహత్యకు కారణమైన కారింగుల లింగయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సీఐకి ఆత్మకూర్ ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ సహకరించారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
నార్కట్‌పల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో జరిగింది. ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం చౌటబావి గ్రామానికి చెందిన ఏనాల వెంకట్‌రెడ్డి(36) చిట్యాలలో క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు గోపలాయపల్లి వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో పురుగుల మందు తాగి తన తమ్ముడికి ఫోన్ చేశాడు. తన పిల్లలను మంచిగా చూసుకో అని చెప్పి.. గోపలాయపల్లి గుట్టపై తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానంటూ తమ్ముడికి చెప్పాడు. వెంటనే వెంకట్‌రెడ్డి సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్ట్