
నేను హెల్మెట్ ధరించి ఉంటే మీతో ఉండేవాన్ని..
చిట్యాల: హెల్మెట్ ధరించకపోవటంతో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. అతడి దశదినకర్మ రోజున కుటుంబ సభ్యులు రూపొందించిన పోస్టర్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అజయ్‌కుమార్‌గౌడ్(26) ఓ ఫార్మసీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 18న అజయ్‌కుమార్‌గౌడ్ బైక్‌పై వలిగొండలో వివాహానికి హాజరై రాత్రి సమయంలో తిరుగు పయనమయ్యాడు. వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోకి రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కాల్వలో పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం నిర్వహించిన అజయ్‌కుమార్‌గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో.. ‘నేను హెల్మెట్ ధరించి ఉంటే ఈ రోజు మీ అందరితో కలిసి ఉండేవాడిని.. బైక్ నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలి’ అంటూ అజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు గ్రామంలోని రెండు చోట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు.