
‘సఫాయిమిత్ర సురక్ష’ మరింత పటిష్టం
సూర్యాపేట అర్బన్: పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యపరిరక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడటానికి వీలుంటుందని భావిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా అనేకమంది పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సఫాయి సురక్షను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విధిగా వైద్యశిబిరాల నిర్వహణతోపాటు ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందజేయాలని సూచించింది.
కార్మికులకు ప్రయోజనం కలిగేలా..
సూర్యాపేట జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల ఉన్నాయి. వీటిలో 549 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు నిత్యం రోడ్లు ఊడ్చడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, చెత్త కుప్పలు ఎత్తడం లాంటి పనులు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూంపొందించారు. పీఎఫ్, ఈఎస్ ఐ సక్రమంగా వర్తింపజేసేలా శ్రద్ధ చూపాలని నిర్ణయించారు. వీరి కోసం గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆరోగ్య సంరక్షణ లాంటి సదుపాయాలు అందేలా చూడాలనుకున్నా ఎక్కడా అమలు కాలేదు. ఆ సౌకర్యాలను అందించేలా చూడాలని మరొకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించింది. తీవ్ర అనారోగ్యం ఉంటే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సమీపంలోని ఆసుపత్రులను సంప్రదించి వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో..
స్థానిక వైద్యశాఖ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో శిబిరాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సాధారణ వైద్యం అందించే వీలుంటే ఇక్కడే చికిత్స చేయనున్నారు. వ్యాధి పరిమాణం ఎక్కువైతే రాష్ట్ర రాజధానికి తరలించనున్నారు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన
పారిశుద్ధ్య కార్మికులకు వేసవిలో వచ్చే ఎండలతో వానాకాలంలో వచ్చే వర్షంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య రక్షణ కిట్లు ఇవ్వనున్నారు. చేతికి గ్లౌజులు, కాళ్లకు పొడవాటి బూట్లు, తల రక్షణకు హెల్మెట్ పంపిణీ చేయనున్నారు. అంటువ్యాధులను అరికట్టడానికి తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి
విధిగా వైద్య శిబిరాల
నిర్వహణకు ఆదేశం
ఆరోగ్య పరిరక్షణ కిట్లు పంపిణీ
చేయాలని సూచన
మున్సిపాలిటీ పారిశుద్ధ్యకార్మికులు
సూర్యాపేట 303
కోదాడ 176
తిరుమలగిరి 63
హుజూర్‌నగర్ 42
నేరేడుచర్ల 28
ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం
పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలకు ఒకసారి స్థానిక వైద్యులతో వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్‌లో పరీక్షలు చేయించాం. జూన్ రెండో వారంలో మళ్లీ చేయిస్తాం. సఫాయిమిత్ర సురక్ష అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నాం.
– మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

‘సఫాయిమిత్ర సురక్ష’ మరింత పటిష్టం