
వైద్యం మాఫియాపై నేడు చర్చా వేదిక
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యం మాఫియా ఆగడాలు, అధికారుల అలసత్వం నేపథ్యంలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానికంగా ‘సూర్యాపేట వైద్య రంగానికి ఏం రోగం వచ్చింది’ అనే పేరుతో చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.
యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం శాస్త్రోక్తంగా నిత్యపూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలు వుదీరిన స్వయంభూలను, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శనహోమం, నిత్యకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో వైభవంగా చేపట్టారు. అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి,అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు చేపట్టారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.