షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలి
తిరుమలగిరి : రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ షరతులు లేకుండా రుణం మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ కోరారు. ఆదివారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ మండల సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడంతో కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అరాచకాలు సృష్టిస్తోందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అనర్హులకు, అధికార పార్టీ కార్యకర్తలకే ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఎండీ.ఫయాజ్, నాయకులు ఎల్లంల యాదగిరి, శ్రీకాంత్, ఎక్బాల్, కొమురెల్లి, వెంకన్న, పురుషోత్తం, యాకస్వామి, షాహిదా, గట్టమ్మ, మల్లేష్ పాల్గొన్నారు.


