యాదగిరి కొండపై కార్పెట్‌లు, మ్యాట్‌లు
● భక్తులకు కాళ్లు కాలకుండా ఏర్పాటు
యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. మాడ వీధుల్లో పరుగులు తీసే పరిస్థితి ఉంది. సమస్య పరిష్కరించేందుకు నూతన ఈఓ వెంకట్రావ్ చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతంలో పర్యటించి భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండ తీవ్రతకు కాళ్లు కాలుతున్నాయని, పరుగులు తీయాల్సి వస్తుందని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు బస్టాండ్, మాడ వీధుల్లో ఆదివారం కాయిర్ మ్యాట్‌లు, కార్పెట్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే లక్ష్యమని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని ఈఓ తెలిపారు.
స్వర్ణగిరి క్షేత్రంలో
నేత్రపర్వంగా తిరువీధి సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు.
యాదగిరి కొండపై కార్పెట్‌లు, మ్యాట్‌లు


