అంతర్జాతీయ స్థాయిలో భద్రత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో జరిగే బుద్ధపూర్ణిమకు హాజరవుతున్న ప్రపంచ సుందరీమణులకు అంతర్జాతీయ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి సమీపంలోని వెల్లంకి అతిథి గృహం నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారి వెంట పూర్తి స్థాయిలో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవిహార్, వెల్లంకి గెస్ట్ హౌస్‌తో పాటు బుద్ధవనంలో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ సుందరీమణులు తిరిగే ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం ఎల్లో కలర్ పాసులు కలిగిన వారిని మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతిస్తామన్నారు. పోలీసులు అధికారులు, ఇతర శాఖల అధికారులకు ఆరెంజ్ కలర్ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రవేశద్వారాల వద్ద విధులు నిర్వర్తించే వారితో పాటు వీఐపీలకు, బయటి వ్యక్తులకు గ్రీన్ కలర్ పాస్‌లు, మీడియాకు వైట్‌కలర్ పాసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడా ట్రాఫిక్ మళ్లించకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


