మైనర్లకు వాహనాలిస్తే కేసులు తప్పవు
సూర్యాపేటటౌన్ : మైనర్‌లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కేసులు తప్పవని ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలు, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ప్రమాదాలకు గురవుతూ ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తున్నారని తెలిపారు. ఎవరైనా చెడు ప్రవర్తన కలిగి ఉంటే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి లేదా చట్టపరిధిలో అవగాహన కల్పిస్తూ మంచి మార్గం వైపు నడిచేలా కృషిచేయాన్నారు. నూతన వాహన చట్టంల ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి పట్టుబడితే వారికి 25 ఏళ్ల వయసు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెనన్స్ ఇవ్వడం కుదరదన్నారు. అలాగే రూ.25 వేల జరిమానా విధిస్తారని, తల్లిదండ్రులు, వాహన యజమానులు జైలుపాలు అవుతారని గుర్తు చేశారు. వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు ఆంజనేయులు, బాలునాయక్, సాయిరాం, ఏడుకొండలు, ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ కె.నరసింహ


