నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్‌, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్‌, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ

May 10 2025 2:14 PM | Updated on May 10 2025 2:14 PM

నేటి

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక,

ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్‌, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్‌పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదం

యాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు.

యాదగిరీశుడి దర్శనం

యాదగిరిగుట్ట : మిస్‌ వరల్డ్‌ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్‌, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు.

● అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు.

● త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు.

● అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.

● గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్‌ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు.

● పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు.

అరటి, మామిడి తోరణాలతో..

ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్‌, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్‌ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

నాగార్జునసాగర్‌ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్‌కు రానున్నారు.

● మిస్‌ వరల్డ్‌ పోటీ దారులు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు.

● అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు.

● విజయ విహార్‌ ఎదుట ఈవెంట్‌ మేనేజర్‌ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు.

● ఆ తర్వాత విజయ విహార్‌ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్‌ ఉంటుంది.

● అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాస్థూపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్‌లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది.

● మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్‌ గైడ్‌ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు.

● మహాస్తూపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్‌ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్‌ చాటింగ్‌లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు.

● అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది.

● అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్‌లో పాల్గొని హైదరాబాద్‌ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్‌ నుంచే భోజనాలను తీసుకురానున్నారు.

భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్‌ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్‌పోచంపల్లికి ఈనెల 15న మిస్‌వరల్డ్‌ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్‌ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్‌ థీమ్‌ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

● మిస్‌వరల్డ్‌ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు.

● టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్‌ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్‌ మ్యూజికల్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు.

● మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు.

● అక్కడి నుంచి కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్నాక్‌ రిఫ్రెష్‌మెంట్‌ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు.

● అక్కడ నుంచి హంపి థియేటర్‌కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్‌ ఇక్కత్‌ వస్త్రాలతో మోడల్స్‌ నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారు.

● తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్‌ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్‌వరల్డ్‌ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు.

● టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్‌లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్‌లో పోచంపల్లి ఇక్కత్‌ స్టాల్స్‌ ఏడు, మిగతావి గద్వాల్‌, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్‌ స్టాల్స్‌ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్‌ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు.

● రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్‌ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్‌ వెళ్తారు.

పోచంపల్లిలో ‘ఇక్కత్‌ థీమ్‌’

బుద్ధుడి చెంతకు..

హైదరాబాద్‌కు చేరుకున్న మిస్‌ వరల్డ్‌ పోటీదారులు

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, 1
1/4

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక,

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, 2
2/4

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక,

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, 3
3/4

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక,

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక, 4
4/4

నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు చారిత్రక,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement