
నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్ సస్పెన్షన్
ఫ సీనియర్ అసిస్టెంట్, తహసీల్దార్‌పై చర్యలకు సిఫారసు
భానుపురి (సూర్యాపేట) : వివాదంలో ఉన్న భూమిని పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారులోని 75 సర్వే నంబర్‌లో నిమ్మల భారతమ్మకు చెందిన 5 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఈ భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేసేందుకు డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఏప్రిల్ 24న రెవెన్యూ లీలలు శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాంబాబు విచారణలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు తప్పు చేసినట్లు రుజువు అయినట్లు కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో అక్రమంగా పట్టా చేసిన అప్పటి నాయబ్ తహసీల్దార్ (డీటీ) హరిచంద్రప్రసాద్, ఆర్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం కలెక్టర్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఇంద్రకుమార్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లినందున అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా సీసీఎల్‌ఏకు సిఫారసు చేశారు. ఇక అప్పటి తహసీల్దారు వినోద్‌కుమార్‌పైనా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జ్‌మెమో జారీ చేస్తూ సీసీఎల్‌ఏకు పంపినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీకి సన్మానం
చివ్వెంల(సూర్యాపేట): ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్య కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీ నాతి సవీందర్ కుమార్‌ను శుక్రవారం ఎస్సీ నరసింహ సూర్యాపేటలోని తన కార్యాలయంలో సన్మానించారు. కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
సూర్యాపేటటౌన్: వైద్య చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేసే వైద్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ ఎం.రాజీవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య విప్లవం–ప్రైవేట్ వైద్యరంగ ప్రక్షాళన అనే అంశంపై వైద్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజారోగ్యం మెరుగునకు చేపట్టిన ఈ కార్యక్రమానికి వైద్యులు తమ సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ సూర్యాపేట ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఎల్.రమేష్, వైద్యులు పాల్గొన్నారు.

నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్ సస్పెన్షన్