ఇంట్లోని సామగ్రి దగ్ధం
మునగాల: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్ తండాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ తండాకు చెందిన దివ్యాంగురాలు గంటపంగు సైదమ్మ తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.70వేల మేరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాఽధితురాలు కోరుతోంది.
రోడ్డు వెంట రపాయన వ్యర్థాలు వదులుతున్న లారీలు సీజ్
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట రసాయన వ్యర్థా లను వదులుతున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రసాయన వ్యర్థా లతో వచ్చిన రెండు లారీలు ఆదివారం రాత్రి అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట వాటిని వదులుతుండగా గ్రామస్తులకు తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు లారీ యజమానులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్వర్ తెలిపారు.
సర్వే అడ్డగింత
హుజూర్‌నగర్ రూరల్: మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 64వ సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 164 ఎకరాల భూమి ఉండగా అందులో 60 ఎకరాలకు మాత్రమే పట్టా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 104 ఎకరాల భూమిని పలువురు రైతులు ఆక్రమణలో ఉంది. ఇదే భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ సర్వేయర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సర్వే నంబర్‌లోని కొంత భూమిని గతంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తన కుటుంబ సభ్యుల పేరుతో పట్టా చేయించుకున్నారు. ఈ అక్రమాలు బయటపడి అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్‌పై కేసులు నమోదయ్యాయి.
యువకుడు అదృశ్యం
రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల సందీప్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సందీప్ గత నెల 28న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా సందీప్ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అతడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లయ్య తెలిపారు.


