యాదగిరిగుట్ట కారిడార్ అభివృద్ధి చేయండి
సాక్షి,యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీని ఎంపీ చామల కలిసి వినతి పత్రం అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసర కారిడార్‌లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు. ప్రాచీన దేవాలయాలు, వారసత్వ గ్రామాల మధ్య సరైన రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, కొలనుపాక, కీసరగుట్ట, పెంబర్తి ప్రాంతాల మధ్య కనెక్టివిటీ రోడ్లు విస్తరించాలని కోరారు. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నంబర్ 8 నుంచి కీసర జంక్షన్– యాదగిరిగుట్ట–కొలనుపాక–పెంబర్తి మధ్యన రోడ్డు అభివృద్ధి చేస్తే యాదగిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్, కరీంనగర్ హైవేలపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కూడా ఈ దారి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందన్నారు. ఆలేరు నుంచి బచ్చన్నపేట వరకు లింక్ రోడ్డు నిర్మాణం ద్వారా జాతీయరహదారి 163–365బీ మధ్యన అనుసంధానం కలుగుతుందన్నారు. దీనివల్ల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట రహదారిలో ఇప్పటికే ఆమోదించిన బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ మరియు లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతాల్లో రెండు ఎలివేటెడ్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లు మంజూరు చేయాలన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


