డ్రగ్స్‌ కేసు: విస్తరిస్తున్న మత్తు ఉచ్చు

Kannada Actor Couple Diganth And Aindrita Ray Interrogated CCB - Sakshi

సీసీబీ ఎదుట హాజరైన నట దంపతులు ఐంద్రిత రై, దిగంత్‌

మాజీ మంత్రి తనయుడు ఆదిత్య ఆళ్వా రిసార్టు, బంగ్లాలో సోదాలు  

సీసీ ఫుటేజీలు స్వాధీనం మేనేజర్‌ అరెస్టు

పరప్పన జైలు క్వారంటైన్‌లో రాగిణి ద్వివేది  

సాక్షి, బెంగళూరు:  శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసు అనేక మంది మెడకు చుట్టుకొనేలా ఉంది. ప్రముఖ నటి ఐంద్రితా రై, ఆమె భర్త, నటుడు దిగంత్‌లు బుధవారం సీసీబీ ఎదుట హాజరయ్యారు. ముఖ్య నిందితులు రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ఇతరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం బుధవారం 11 గంటలకు చామరాజపేటలోని సీసీబీ ఆఫీసుకు రావాలని మంగళవారం వారు నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.

నిందితునితో ఐంద్రిత, దిగంత్‌ ఫోటోలు   
డ్రగ్స్‌ దందా కేసులో ప్రధాన పెడ్లర్‌ షేక్‌ ఫాజిల్‌తో కలిసి ఐంద్రితా రై, దిగంత్‌లు కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఐంద్రిత దంపతులు డ్రగ్స్‌ విక్రేతలను సంప్రదించినట్లు సీసీబీ గుర్తించింది. గ్లామర్‌ జంటకు పిలుపు రావడం శాండల్‌వుడ్‌తో పాటు అభిమానులకు కలవరం కలిగిస్తోంది. మేం ఎక్కడకీ పారిపోవడం లేదు, తప్పకుండా సీసీబీ విచారణకు హాజరవుతామని ఐంద్రితా, దిగంత్‌లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.   

నటి రాగిణి ద్వివేదితో ఐంద్రిత రై (ఫైల్‌)

బుల్లితెర నటులకు లింకులు  
డ్రగ్స్‌ భూతం టీవీ నటులనూ తాకింది. నిందితుడు షేక్‌ ఫాజిల్‌తో బుల్లితెర నటులు కలిసి ఫోటోలు ఒక్కొక్కటే బయట పడుతున్నాయి. గట్టిమేళ సీరియల్‌లో నటించిన రక్ష్‌ , అగ్నిసాక్షి విజయ్‌సూర్య, రాధారమణ, శ్వేతాప్రసాద్‌లు ఫాజిల్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పలువురు నటీనటులు తమకు డ్రగ్స్‌తో సంబంధం లేదని చెప్పుకున్నారు. (బచ్చన్‌ ఫ్యామిలీకి మరింత భద్రత)

కేంద్ర కారాగారంలో రాగిణి  
డ్రగ్స్‌ కేసులో సీసీబీ అరెస్ట్‌ చేసిన రాగిణి ద్వివేదిని పరప్పన అగ్రహారం జైలులోని కరోనా క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. సీసీబీ కస్టడీ ముగియగా ఆమె 2 వారాలు పరప్పన జైలులో ఉంటారు. వీఐపీ కావడంతో ఆమెకు గట్టి భద్రతను కల్పించారు. 10 రోజుల వరకు కరోనా పాజిటివ్‌ రాకపోతే ఆమెను సాధారణ గదికి తరలిస్తారు. జైలులో రాగిణి చాలా దిగులుగా బాధపడుతూ గడిపారు. అధికారులు ఇచ్చిన రోటీ, దాల్‌ను ఆరగించి పుస్తకం చదువుతూ తరువాత నిద్రపోయిన్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఉదయం కాలకత్యాలు తీర్చుకొని టిఫిన్‌ తిని పుస్తకం పఠనంలో నిమగ్నమయ్యారు. మరోవైపు నటి సంజన రెండు రోజుల సీసీబీ విచారణ కొనసాగుతోంది.    

ఆదిత్య ఆళ్వా మేనేజర్‌ అరెస్ట్‌   
ఆదిత్య ఆళ్వా మేనేజర్‌ రామ్‌దాసను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని ల్యాప్‌టాప్, ఆఫీసు కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడి ముగ్గురు పనివాళ్లను, ఇంటి సెక్యూరిటీ గార్డులను విచారించారు. ఇక్కడ గంజాయిని మాత్రమే సేవించేవారని వారు చెప్పినట్లు సమాచారం.   

 
పరారీలో ఉన్న ఆదిత్యా ఆళ్వా(ఫైల్‌)

ఆదిత్య ఆళ్వాపై గురి  
కాంగ్రెస్‌ మాజీ మంత్రి, దివంగత జీవరాజ్‌ ఆళ్వా పుత్రుడు ఆదిత్య ఆళ్వా నివాసంపై సీసీబీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. బెంగళూరు హెబ్బాళలోని హౌస్‌ ఆఫ్‌ లైఫ్‌ రిసార్ట్, ఇంటిలో సోదాలు జరిపారు. డ్రగ్స్‌ కేసు వెలుగుచూసినప్పటి నుంచీ ఆదిత్య అదృశ్యమయ్యాడు. అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉంది. సీసీబీ పోలీసులు ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో నిఘా పెట్టారు. హెబ్బాళలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతని బంగ్లా నివాసంలో సోదాలు జరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో పెద్దపెద్ద పార్టీలు ఇక్కడ నిర్వహించారని ఆరోపణలున్నాయి. ఈ సోదాల్లో కొన్ని మత్తు పదార్థాలను పట్టుకున్నట్లు సమాచారం. ఆదిత్య బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌కు బావమరిది. ఇక నటీమణులు రాగిణి, సంజనలు బాగా పరిచయం. ఆదిత్య ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నిందితుడు రవిశంకర్‌.. ఆదిత్య ఆళ్వా పేరు చెప్పినట్లు తెలిసింది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top