జీతం ప్రభుత్వానిది.. పని పార్టీది..! | - | Sakshi
Sakshi News home page

జీతం ప్రభుత్వానిది.. పని పార్టీది..!

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

● హాస్టల్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా చేరిన ఐటీడీపీ కార్యకర్త

● విధులకు రాకుండా జీతం తీసుకుంటున్న వైనం

● చర్యలకు వెనుకాడుతున్న అధికారులు

ప్రత్యేక అనుమతులు ఇచ్చారా

రాజపురం వసతి గృహంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం పొందిన పుల్లట రాజు ఐటీడీపీ కార్యకర్తగా బహిరంగంగానే టీడీపీ పార్టీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వ్యక్తికి ఈ తరహా కార్యక్రమాలు, పార్టీ నాయకులతో కలిసి తిరగడంలో చట్టపరంగా ప్రత్యేక అనుమతులు ఏమైనా కల్పించారా..? అధికారులు స్పందించి ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలి. – సనపల కృష్ణారావు,

ఎంపీటీసీ సభ్యుడు, రాజపురం

కవిటి:

తనో వాచ్‌మెన్‌.. పనికి రాకుండా జీతం తీసుకుంటున్నారు. ఎందుకిలా.. అని వార్డెన్‌ ఆరా తీస్తే కొందరు ‘పెద్ద మనుషుల’ పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ శాఖ ప్రశ్నించలేకపోయింది. ఓ సారైతే జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నుంచి నోటీసులు కూడా వచ్చాయి. కానీ దానికి బదులిచ్చేంత సమయం వాచ్‌మెన్‌కు లేకపోయింది. ఉద్యోగం చేయను అని చెప్పడు.. పోనీ రాజీనామా అయినా చేస్తాడా అంటే అదీ లేదు. ఓ చిన్న ఉద్యోగి ఇంత నిర్భయంగా ఎలా వ్యవహరిస్తున్నాడని ఆరా తీస్తే ‘ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి’ అనే హోదా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే...

కవిటి మండలం రాజపురం బీసీ బాలుర వసతి గృహంలో 2025 జూలైలో ఆర్‌.బైరిపురానికి చెందిన పుల్లట రాజు అనే వ్యక్తి ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నైట్‌ వాచ్‌మెన్‌ ఉద్యోగం పొందారు. కానీ ఏనాడూ పనికి రాలేదు. హాస్టల్‌లో సాయంత్రం 4 నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఒక్కరోజు కూడా విధులు నిర్వహించలేదు. కానీ నెలకు రూ.15 వేలు చొప్పున ఐదు నెలల జీతం కూడా అందుకున్నారు. దీనిపై హాస్టల్‌ వార్డెన్‌ ఉపేంద్రను వివరణ కోరగా.. రాజు సక్రమంగా డ్యూటీ చేయలేదని, అందుకే ఐదు నెలలకు మాత్రమే జీతం చెల్లించామని తెలిపారు. కానీ ఆ తర్వాత ఆయన విధులకు రాకుండానే జీతం చెల్లించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ మనుషుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు బిక్కమొకం వేయక తప్పలేదు.

నోటీసులు వచ్చినా...

రాజు గత కొన్ని నెలలుగా విధులకు రావడం లేదని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి నుంచి సైతం తాఖీదులు వచ్చాయి. దీనిపై ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పుల్లట రాజు బదులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగం చేయను అని చెప్పలేదు. రిజిగ్నేషన్‌ లెటర్‌ కూడా ఇవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పుల్లట రాజు ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అడ్డూ అదుపు లేకుండా టీడీపీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించిన దాఖలాలు లేవని స్థానికంగా బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న పుల్లట రాజును ‘సాక్షి’ వివరణ కోసం సంప్రదించింది. హాస్టల్‌లో పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టాలని వసతి గృహం సంక్షేమాధికారి ఉపేంద్రను తాను పలుమార్లు కోరానని తెలిపారు. దీనితో తనపై ఆయన కఠినంగా వ్యవహరించి తనకు జీతం పొందేందుకు అవసరమైన డ్యూటీ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వలేదని, దీంతో జీతం ఆలస్యం కావడంతో తాను కొంత అసహనానికి లోనై విధులు డుమ్మాకొట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. మొత్తానికి పుల్లట రాజు తన విధుల కంటే ఐటీడీపీ ప్రచార కార్యక్రమాలు, టీడీపీ నేతల కార్యక్రమాల్లో బహిరంగంగానే పాల్గొంటూ విధులకు సక్రమంగా హాజరుకాలేదన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇదే విషయమై హాస్టల్‌ సంక్షేమాధికారి ఉపేంద్ర వివరణ కూడా కోరగా.. పుల్లట రాజు నైట్‌ వాచ్‌మెన్‌గా 2025 జూలై నుంచి కేవలం ఐదు నెలల కాలానికి మాత్రమే డబ్బులు చెల్లించామని చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన విధులకు రాని కారణంగా డ్యూటీ సర్టిఫికెట్‌ ఇవ్వలేదన్నారు. సమాచారం లేకుండా విధులకు హాజరు కాని విషయాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం లిఖితపూర్వకంగా తెలిపామన్నారు. ఈ మేరకు అందుకు గల కారణాన్ని తెలియజేయాలని మెమో జారీచేసినప్పటికీ అతని నుంచి వివరణ అందలేదని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement