● ముగిసిన శేషగిరి అంత్యక్రియలు
కాశీబుగ్గ: సైనికుడినవుతా.. దేశసేవ చేస్తా.. అందరినీ బాగా చూసుకుంటానన్నావ్. ఇంతలోనే చేజారిపోయావా చిన్నోడా.. అంటూ గిన్ని శేషగిరి తల్లిదండ్రులు బాలమ్మ, కాళిదాసు, ఇద్దరు అన్నయ్యల రోదనలతో పెదంచల గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అగ్నివీర్ ఎంపికలో భాగంగా ఈనెల 15న విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన పరుగు పోటీల్లో అస్వస్థతకు గురైన శేషగిరి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు యువకుడి భౌతికకాయం బుధవారం మధ్యాహ్నం విశాఖ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. వందలాది మంది యువత ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టగా, వారిని అనుసరిస్తూ అంబులెన్స్ ఊరులోకి చేరుకుంది. కన్న కొడుకును విగతజీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్నేహితులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం శేషగిరికి అశ్రునయనాల నడుమ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.
అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం


