టెక్కలి రూరల్: కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన జుత్తు చలపతి అనే దివ్యాంగుడు ఏడాది కాలంగా సదరం సర్టిఫికెట్ కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బుధవారం తెలిపారు. గతంలో పింఛన్ వచ్చేదని అయితే తన పాత సదరం సర్టిఫికెట్‌లో సన్ ఆఫ్ వద్ద తన తల్లి పేరు రావడంతో దానిని డిలేట్ చేసి, గతేడాది నవంబర్ 16వ తేదీన స్లాట్ బుక్ చేసుకుని 18వ తేదీన టెక్కలి జిల్లా ఆస్పత్రికి వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది సర్వర్ బాగులేదని చెబుతూ మూడుసార్లు ఆస్పత్రి చుట్టూ తిప్పించుకున్నారన్నారు. వైద్యుడు వద్ద ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఫోన్ చేస్తున్నాడని.. ముందుగా రూ.30 వేలు ఇస్తే పని అయిపోతుందని చెప్పాడన్నారు. అయితే తాను లేటు చేయడంతో దానిని రూ.50 వేలకి పెంచాడని వాపోయారు. కాగా ఇటీవల మరలా ఫోన్ చేయగా ఇప్పుడైతే సుమారు రూ.70 వేలు వరకు అవుతుందని డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే స్పందించి జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. దీంతో వారు టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వెళ్లి అడగమని చెప్పడంతో.. మరలా ఆస్పత్రికి వచ్చి అడగగా మీ డేటా లేదని మరలా దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు వాపోయాడు. ఇలా ఏడాది కాలంగా అనేక అవస్థలు పడుతున్నానని ఆవేదన చెందాడు.


