టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం పరిధిలో జాతీయ రహదారికి కొద్ది దూరంలో వంశధార ఎడమ కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, కాఫీ కలర్ రౌండ్ నెక్ టీ షర్టు ధరించి ఉన్నాడని, టీ షర్టు వెనుక వీఎల్ గోల్డు కలర్ అక్షరాలు ఉన్నాయని, లైట్ కాఫీ కలర్ కాటన్ జీన్ ఫ్యాంట్ ధరించి టక్ చేసుకొని ఉన్నాడని వివరించారు. నీలం రంగు బ్యాటరీ వాచ్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు కోటబొమ్మాళి పోలీసులు(63099 90861)కు సమాచారం అందించాలని కోరారు.
పెంటిభద్రలో..
పలాస : పెంటిభద్రలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎండవేడికి డీహైడ్రేషన్‌కు గురై మూడు రోజులు క్రితమే చనిపోయ ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈదురుగాలుల బీభత్సం
హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పొడుగుపాడు, జాడిపేట, తురకపేట, కృష్ణాపురం, స్కాట్‌పేట గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనంతరం అధికారులు, సిబ్బంది స్పందించి సరఫరా పునరుద్ధరించారు.
ఏసీఏ అతిచేయడం తగదు: ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తన పరిధి దాటి ప్రవర్తిస్తే చేతులుకట్టుకుని కూర్చోరని, ఇబ్బందులు తప్పవని ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఎస్) అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. జిల్లా క్రికెట్ సంఘం విషయం ఎంపికల్లో, నూతన కార్యవర్గం ఏర్పాటు విషయమై మితిమీరి వ్యవహరిస్తే.. కబడ్దార్ అంటూ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ వేదికగా జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవికుమార్ ఇటీవలి వెల్లువెత్తుతున్న అనేక ఆరోపనలు, అంశాలపై వివరణ ఇచ్చారు. ఇదే క్రమంలో ఏసీఏ వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై మండిపడ్డారు. లోధా కమిటీ నిబంధనలు, నియమాలు ప్రకారం క్రీడాసంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, ఇందులో భాగంగానే కోర్టు ఆదేశాల మేరకే జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాటైందన్నారు. ఏసీఏ సైతం ఆమోదించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లా క్రికెట్ సంఘాలకు బాసులు ఎవరూ లేరన్నారు. జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలకు ఆరోపణలు ఉన్న వ్యక్తులను సెలక్టర్లగా ఎలా పంపించారని ఏసీఏను ప్రశ్నించారు. రెండు జట్లగా ఏర్పాటుచేసి సెలక్షన్ మ్యాచ్‌లను నిర్వహించాలని చూసిన రెండు జట్లలో 14 మంది ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులని జిల్లా క్రికెట్ పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారని అంగీకరించారు. కొంతమంది ఏసీఏలో లేని ఆఫీస్‌బేరర్లు మితిమీరి వ్యవహరిస్తున్నారని కూన మండిపడ్డారు. మా జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై అతిచేస్తే.. ఏసీఏకు ఉన్న పరిమితులు, హద్దులు చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని, అంతవరకు తెచ్చుకోవద్దని హితవుపలికారు. సమావేశంలో జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి హసన్‌రాజా షేక్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, ఉపాధ్యాక్షుడు టి.బాలమురళీకృష్ణ, విజయభాస్కర్, ఇతర సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు.


