అక్రమంగా చెరువులు, కొండల్లో తవ్వకాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు
సారవకోట:
మండలంలోని చెరువులకు కీడు కాలం దాపురించింది. పెద్ద, పెద్ద చెరువుల్లో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు చేపట్టి మట్టి, కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో పర్లాకిమిడి రాజులు తవ్వించిన రంగసాగరంలో జేసీబీలను పెట్టి అందులో ఉన్న మట్టి తరలించుకు పోతున్నారు. ఇప్పటికే చెరువులో ఆక్రమణలు విపరీతంగా పెరిగి పోయాయి. 450 ఎకరాలు కంటే అధికంగా ఉండాల్సిన చెరువు విస్తీర్ణం సుమారు 80 ఎకరాలు వరకు తగ్గినట్లు ప్రాథమిక అంచనా. ఎన్నో వందల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ చెరువును అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయక పోవడంతో పలువురు మట్టి వ్యాపారులు రైతులకు, ఇళ్లు నిర్మాణ పనులు చేపట్టే వారికి మట్టిని తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం సచివాలయానికి కూత వేటు దూరంలోనే జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది ధర్మలక్ష్మిపురం గ్రామంలోని కలువల చెరువులో వందలాది ట్రాక్టర్ల మట్టి తరలించి అదే గ్రామానికి చెందిన జేసీబీ యజమాని సొమ్ము చేసుకున్నాడు.
అధికారులు పట్టించుకోరా..?
మండలంలోని జమచక్రం రెవెన్యూ గ్రామంలో జమచక్రం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట గ్రామానికి రోడ్డు మార్గం గత ఏడాది నిర్మించారు. ఈ నిర్మాణానికి కావాల్సిన గ్రావెల్‌ను స్థానిక టీడీపీ నాయకులు పక్కనే ఉన్న కొండల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తరలించి రోడ్డు నిర్మాణ పనులు చేట్టారు. ఆ కొండలకు ఆను కుని సర్వే నంబర్ 59లో ఉన్న మాలపల్లి కొండ అంచులో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు చేప ట్టి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తన సొంత అవసరాలకు అవసరమైన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు తన స్థలాన్ని ఈ గ్రావెల్ వేసి చదును చేసుకున్నాడు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విచారకరం. సంబంధిత గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది ఇలాంటి అక్రమ తవ్వకాలను గుర్తించి ఉన్నతాధికారులతో పాటు మైన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా నోరు మెదపడం లేదు.
గత ప్రభుత్వం హయాంలో కొండ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు స్థలం కేటాయించారని, ఆ స్థలాలకు పేదలకు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లిన నాయకులు ఇప్పుడు మాత్రం కొండలను తవ్వి వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. అంగూరు గ్రామంలోని సచివాలయానికి కూత వేటు దూరంలో గ్రావెల్‌తో ఉన్న చెరువు నుంచి ఎప్పటికప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది నోరు మెదపడం లేదు. ఆ ట్రాక్టర్లు నిలుపుదల చేసి ప్రశ్నించే దాఖలాలు లేవు. నౌతళ ఘాట్ రోడ్డుకు సమీపంలో ఉన్న కొండ నుంచి నిత్యం గ్రావెల్ తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నా ఇక్కడున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


