శ్రీకాకుళం అర్బన్: విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలో ఈనెల 19వ తేదీన తపాలా అదాలత్ నిర్వహణ ఉంటుందని పోస్టల్ సహా య సంచాలకులు కేవీడీ సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, ఎంవీపీ బస్ కాంప్లెక్స్ పక్కన విశాఖపట్నం–530017లో పోస్టుమాస్టర్ జనరల్‌తో 122వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 15వ తేదీ లోగా ‘122వ తపాలా అదాలత్ ‘అనే శీర్షికతో కేవీడీ సాగర్, సహాయ సంచాలకులు, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం విశాఖపట్నం –530017 అనే చిరునామాకు పంపాలని కోరారు.
అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఈఆర్వో పరిధిలోని 15 సెక్షన్లలో విద్యుత్ వినియోగదారుల సర్వీసుల కోడ్ నంబర్లు మార్పు చేశామని, ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేవారు, కొత్త కోడ్ నంబర్లతో మార్పులు చేసుకోవాలని ఈఆర్వో ఏఏఓ ఎం.అప్పారావు సూచించారు. ఇటీవల జరిగిన మార్పులపై శనివారం ఆయ న మాట్లాడారు. ఈఆర్వో పరిధిలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, తొగరాం, పైడిభీమవరం, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు, గార, అరసవల్లి, పిఎన్ కాలనీ, బలగ, రాగోలు తదితర సెక్షన్లలో మొత్తం 2.76 లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులు ఉన్నారని, వీరి పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ లైన్‌మెన్లకు పరిధి ప్రకారం కొత్తగా కోడ్ నంబర్లను మార్చామని, దీన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈపీడీసీఎల్ యాప్‌లో విద్యుత్ వినియోగ బిల్లులు చెల్లిస్తు న్న వారు తమ కొత్త కోడ్ నంబర్లను యాప్‌లో మార్పు చేసుకోవాలన్నారు.
మందస: మీల గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని బాధిత రైతులు శనివారం సభ నిర్వహించారు. కానీ పోలీసులు నలువైపులా నిర్బంధించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత రైతులకు సానుభూతి తెలపడానికి వచ్చిన సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద్, సీపీఎంఏల్ జాయింట్ సెక్రటరీ వంకల మాధవరావు, పీఓడబ్ల్యూ కార్యదర్శి కుసుమ, కోనే రు రమేష్, పౌర హక్కుల సంఘం సభ్యులు పత్తిరి దానేష్, ఐఎఫ్‌టీయూ సభ్యులు జుత్తు వీరస్వామిలను అరెస్టు చేసి నిర్బంధించారని రైతులు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పంట భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
హిరమండలం: వంశధార కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తామని బీఆర్‌ఆర్ వంశధార డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ అరవల రవీంద్రబాబు అన్నారు. శనివారం గొట్టా బ్యారేజీ యాఫ్రాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సాగునకు సంబంధించి చివరి వరకూ సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. వంశధార ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఈ ఏడాది 226 పనులకు ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయని తెలిపారు. టెక్కలి సర్కిల్ పరిధిలో 76 పనులు మంజూరైతే 73 పనులు పూర్తయ్యాయన్నారు. నరసన్నపేట సర్కిల్‌కు సంబంధించి 116 పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేసినట్టు తెలిపారు. ఈ సీజన్ నాటికి రెండు యాప్రాన్లు, తర్వాత రెండు యాప్రాన్లు పూర్తిచేస్తామన్నారు.


