శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు తదితరులు
ప్రజలకు వెన్నుపోటు
హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిఽధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్ వంటివి చెప్పి నిలువునా ముంచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి.
– ధర్మాన కృష్ణదాస్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో నినాదాలు చేస్తూ సర్కారు తీరును తూర్పారబట్టారు. 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి మాటేమిటని నిలదీశారు. ఆడబిడ్డ నిధి గురించి పట్టింపు ఉందా.. అని అడిగారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అంటూ జనాలకు గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. – సాక్షి నెట్‌వర్క్
పలాస నియోజకవర్గంలో..
పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, కాశీబగ్గ మున్సిపాలిటీలో జరిగిన నిరసన కార్యక్రమంలో అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీమంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు.
నరసన్నపేట నియోజకవర్గంలో...
జలుమూరు మండలంలోని చల్లవానిపేటలో, సారవకోటలో వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో చించివేసి నిరసన తెలిపారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో..
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులతో కలిసి శుక్రవారం శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి వద్ద ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చించివేసి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో..
ఎమ్మెల్సీ, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకుడు పెనుమత్స సురేష్‌రాజు, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రణస్థలం మండలం కోష్ట గ్రామంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జి.సిగడాం మండల కేంద్రంలోనూ వైఎస్సార్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి.
టెక్కలి నియోజకవర్గంలో..
టెక్కలి నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో కార్యక్రమం జరిగింది. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో చించివేసి నిరసన తెలియజేశారు. టెక్కలి పట్టణంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది.


