ఆమదాలవలస: ఎల్ నినో కారణంగా రానున్న ఖరీఫ్ కాలంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని, వర్షాధారానికి అనుకూలమైన విత్తనాలను రైతులు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక, కొనుగోలు, విత్తన శుద్ధి వంటి అంశాలపై స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘ఖరీఫ్ విత్తన దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విత్తన ఉత్పత్తిలో మెలకువలు, విత్తన శుద్ధి వంటి ప్రాథమిక అంశాలతో పా టు, భారత వ్యవసాయ శాఖ పిలుపు మేరకు, కేత్ బచావో అభియాన్(భూసార సంరక్షణ) అంశాల్ని ప్రతి రైతు పాటించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పథకం డైరెక్టర్ పి.సత్యనారాయణ మాట్లాడుతూ నేలను నిరంతరం అనేక రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల, నేల సారం పెరగడమే కాక రైతులకు నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. పచ్చి రొట్ట పంటలు సాగు విధానాలు, నేల సంరక్షణ, వివిధ పంటలలో రకాల ఎంపిక వంటి అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బసు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ, రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు పాల్గొన్నారు.
‘ఇంధన ధరలు తగ్గించాల్సిందే’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, మన రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్, చమురులో 50 శాతం వాటా మనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేడ్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు పాపం కేంద్రానిదేనని అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోలు ధర రూ.118కి చేరిందన్నారు. ఏపీలో వ్యాట్ పేరుతో అదనపు భారం మోపుతున్నారన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటని అన్నారు. దీని వల్ల అన్ని వస్తువుల ధర లు పెరిగిపోయాయని తెలిపారు.
భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం : కలెక్టర్
వజ్రపుకొత్తూరు రూరల్: దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు భూ రికార్డుల సవరణ చేసి భూ వివాద రహిత రెవెన్యూ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ స్థాయి కేంద్రంగా సేవలు అందిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో గల నువ్వలరేవులో శు క్రవారం వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామంలో ఒక నెలలో 4 విడతలుగా అధికారులు పర్యటించి అర్జీదారుడి ఫిర్యాదు మేరకు భూ వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉప్పుటేరు వంతెన నిర్మాణం కోసం అప్రోచ్ రోడ్డు పనులు వారం రోజుల్లోగా ప్రారంభం కాకపోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మువ్వల నగేష్ మృతిపై టీడీపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట ఇచ్చి ఇంత వరకు న్యాయం చేయలేదని బాధితులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
సభలో అపశృతి
నువ్వలరేవులో శుక్రవారం నిర్వహించిన వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్ కార్యక్రమంలో అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌లు ఒక్కసారిగా కూలిపోవడంతో అధికారులు అప్రమ త్తమై టెంట్‌ను చేతితో పైకి ఎత్తారు. ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


