మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలోని మహేంద్రతనయ నది, శ్మశాన వాటిక పరిసర ప్రాంతంలో 2025 మార్చిలో వరదకట్ట పనులు చేపట్టారు. ఈ పనులను ఉపాధిహామీ సిబ్బంది సామాజిక తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి వరదకట్ట నిర్మాణం కానరావడం లేదు. పక్కనే మెళియాపుట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. వరదకట్టను పూర్తిగా జేసీబీతో మహేంద్రతనయ నదిలోకి తోసేసి అక్కడ ఇటుకలు కాల్చడానికి ఉపయోగించే కట్టెలు ఇతర సామాగ్రి డంప్ చేస్తున్నాడు. మహేంద్రతనయ నదీగర్భంలో చెత్తాచెదారాలతో పాటు విరిగిన ఇటుకలు వేస్తుండటంతో కొంచెం కొంచెంగా నదీ గర్భం సన్నగిల్లుతోంది. దీనిపై క్షేత్రసహాయకుడు అధికారులకు సైతం తెలియజేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే సదరు వ్యక్తి కొద్దిరోజుల్లో నది గర్భాన్ని ఇటుకల ఫ్యాక్టరీలా మార్చుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద ఉధృతి నియంత్రణకు లక్షలాది రూపాయల కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయిస్తూ ఉంటే.. ఓ ప్రయివేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


