మేలైన విత్తనం.. దిగుబడి అనుకూలం..! | - | Sakshi
Sakshi News home page

మేలైన విత్తనం.. దిగుబడి అనుకూలం..!

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

ఆమదాలవలస:

ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది రైతులు పంట పొలాల్లో వరి విత్తనాలు వెదలు జల్లేందుకు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.82,000 హెక్టార్లలో వరిసాగుకు రైతులు పంట పొలాలు సిద్ధం చేశారు. అయితే అనుకూలమైన, నాణ్యమైన వరి విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.చిట్టిబాబు, ఆమదాలవలస ఏవో ఎం.మోహన్‌రావులు సూచిస్తున్నారు. దీనిపై రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.

స్వర్ణ (ఎంటీయూ 7029)

స్వర్ణ (ఎంటీయూ 7029) ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలమైన విత్తనం. 150 రోజుల పంటకాలం. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. ఎండకు, తెగులును తట్టుకొని నిలబడగలదు. వివిధ రకాల భూముల్లో, ఇతర వాతావరణ పరిస్థితుల్లో, అలాగే రెండు పంటలు పండించు ప్రాంతాలకు స్థిరమైన దిగుబడి నిచ్చే సన్నని గింజ రకం ఇది. తక్కువ నత్రజని వినియోగంతో అధిక దిగుబడినిస్తుంది.

ఇంద్ర (ఎంటీయూ 1061)

ఇంద్ర (ఎంటీయూ 1061) రకం పంటకాలం 150 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు నుంచి మూడు వారాలు. సుడిదోమ పోటును తట్టుకోగలదు. సన్నని గింజ, చేను పడిపోదు. పది రోజుల వరకు ముంపును, కొద్దిపాటి చౌడును తట్టుకోగలదు. తినేందుకు బియ్యం అనుకూలంగా ఉంటాయి.

సోనా మసూరి (బీపీటీ 3291)

సోనామసూరి (బీపీటీ 3291) ఖరీఫ్‌ కాలానికి అనుకూలమైన విత్తనం. 135 నుంచి 140 రోజుల పంటకాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. అగ్గి తెగులును తట్టుకొని నిలబడుతుంది. గింజ సన్నంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది.

శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌జీఎల్‌ 2537)

శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌జీఎల్‌ 2537) ఖరీఫ్‌ కాలానికి ఈ విత్తనం అనుకూలం. పంటకాలం 165 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లి కోడును తట్టుకుని నిలబడుతుంది. సన్న బియ్యం 60 రోజుల వరకు నాటుకోవచ్చు. చేను గాలికి పడిపోదు.

సాంబ మసూరి(బీపీటీ 5204)

సాంబ మసూరి (బీపీటీ 5204) విత్తనం ఖరీఫ్‌, రబీ కాలానికి అనుకూలం. 145 నుంచి 150 రోజులు పంట కాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ 4 వారాలు. సన్న బియ్యం అన్నం మృదువుగా రుచిగా ఉండి మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నం తినేందుకు బాగుంటుంది. గ్లెసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ రకం ధాన్యం ద్వారా పండించే బియ్యాన్ని తినడానికి అనుకూలం.

పుష్యమి (ఎంటీయూ 1075)

పుష్యమి (ఎంటీయూ 1075) రకం ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలం. 135 రోజుల పంట కాలం. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. సన్న బియ్యం అలాగే చేను పడిపోదు.

అమర (ఎంటీయూ 1064)

అమర (ఎంటీయూ 1064) పంటకాలం 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. బియ్యం సన్నగా ఉండి గింజ రాలదు, చేను పడిపోదు. ముంపును బాగా తట్టుకుని నిలబడుతుంది.

శ్రీధృతి (ఎంటీయూ 1121)

శ్రీధృతి (ఎంటీయూ 1121) పంటకాలం 120 నుంచి 125 రోజులు. ఎకరాకు 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. మధ్యస్థ సన్నరకం అన్నానికి బాగుంటుంది. నేరుగా విత్తే విధానంలో సాగుకు అనుకూలమైనది.

సుజాత (ఎంటీయూ 1210)

సుజాత (ఎంటీయూ 1210) రకం పంటకాలం 125 నుంచి 135 రోజులు. సార్వాలో 26 నుంచి 28 కింటాళ్ల దిగుబడి, దాళ్వాలో 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటు, అగ్గి తెగులును తట్టుకుని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. గింజ రాలడం తక్కువ. నేరుగా విత్తే విధానానికి అనుకూలం.

మార్టేరు సాంబ (ఎంటీయూ 1224)

మార్టేరు సాంబ (ఎంటీయూ 1224) రకం పంటకాలం 135 రోజులు. 26 నుంచి 28 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటును తట్టుకుని నిలబడుతుంది. పంట చేను పడిపోదు. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది.

వరి విత్తనాలు

Advertisement
 
Advertisement
Advertisement