శ్రీకాంత్‌ శిష్య బృందానికి ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ శిష్య బృందానికి ప్రత్యేక గుర్తింపు

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్‌ రఘు పాత్రుని శ్రీకాంత్‌ శిష్యబృందం దూరదర్శన్‌ కేంద్ర హైదరాబాద్‌, దూరదర్శన్‌ కేంద్ర ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల గ్రేడ్‌ అక్రిడిటేషన్‌ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. సీనియర్‌ విద్యార్థి రామ కౌండిన్య ‘ఏ’ గ్రేడ్‌ అక్రిడిటేషన్‌ పొంది, ఈ ఘనతను సాధించిన జిల్లా తొలి కళాకారుడిగా నిలిచారు. సీనియర్‌ విద్యార్థినులు డొంకాడ నేహ, డి. హిమబిందు, వోలేటి శాశ్వత ఐశ్వర్య ‘బి’ గ్రేడ్‌ అక్రిడిటేషన్‌ పొందారు. విద్యార్థుల కృషి, అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర సాధన, గురువు మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పలువురు కళాభిమానులు అభినందించారు.

రాష్ట్ర ఉత్తమ వసతి గృహాధికారిగా సునీత

టెక్కలి: ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో టెక్కలి గిరిజన కళాశాల బాలికల వసతి గృహం విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడంతో వార్డెన్‌ డి.సునీతను ఉత్తమ వసతి గృహం అధికారిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈమెతో పాటు విద్యార్థులు పి.శ్రీదేవి, జె.సౌజన్య తదితరులు అవార్డులు అందుకున్నారు.

సీఏఏక్యూఎం స్టేషన్‌ ప్రారంభం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతిఒక్కరూ చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటిన్యూయస్‌ అంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌(సీఏఏక్యూఎం) స్టేషన్‌ను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిబ్బంది సంక్షేమానికి కృషి

శ్రీకాకుళం క్రైమ్‌ : ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేలా, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషిచేసేలా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీ (పోలీస్‌ గ్రీవెన్సు)కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది నేరుగా తన నెంబరు 6309990800కు డయల్‌ చేసి లీవులు, సర్వీసు అంశాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement